పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

35

ధనవర్మయను నాతడును దగినవారని నిశ్చయించి యాదూతలు వారివారి చరిత్రములతోగూడ జిత్రపటములు దీసికొనివచ్చిరి. మాతండ్రి వానినెల్ల నందికొని మాతల్లిం జీరి నాసమక్షమందు నారాజకుమారులచరిత్ర మిట్లు చెప్పదొడంగెను.

ఇంతీ! యీతండు కళింగదేశరాజు వీరపాలుని కుమారుడు వీనిపేరు గుణవర్మ వీడు సమస్తశాస్త్రములు సాంగముగా గ్రహించినవాడు రూపంబున మన్మథునిసై తము దిరస్కరించునని చెప్పవచ్చును. వీనిస్థితి ప్రస్తుతము సామాన్యముగా నున్నదట. దేశము ఫలవంతమైనది కాదు. కాపులవలన సమముగ సొమ్మువచ్చుటలేదు. దానధర్మముల మూలమున నాదాయముకంటె వ్యయ మెక్కువైనందున కొంచము ఋణము గలిగియున్నదట.

మరియు రెండవవాఁడు లాటదేశమహారాజు శూరపాలుని కుమారుఁడు ధనవర్మ. ఈతడు రూపంబున సామాన్యుడు. విద్య యేమియును లేదు. రాజ్యభూమియంతయు ఫలవంతమైనది ధనమున గుబేరునితో సముడని చెప్పవచ్చును. ఈయిరువురిలో నుత్తముడెవ్వడో నిరూపించి చెప్పుము వారికి వర్తమానము బంపెదనని అడుగగా మాతల్లి యొక్కింత ధ్యానించుచు మాతండ్రి కిట్లనియె.

ఆర్యా! సర్వజ్ఞులైన మీకంటె నేనెక్కుడెఱుంగుదునా. అయిన నడిగితిరకాన నాకుం దోచినది చెప్పెదను.

శ్లో॥ కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం
     బాంధవాః కునమిచ్ఛంతి మృష్టాన్న మితరేజనాః ॥

అని చెప్పినచొప్పున గన్యరూపమును, తల్లి ధనము, తండ్రి విద్యయుం గోరుదురను శాస్త్రము మీరెరింగినదె అదియుగాక ధనములేక యెన్నిగుణములున్నను, ఎంత విద్య యున్నను, ఎట్టిరూపమున్నను, వ్యర్ధము. ధనముగలవాడే పండితుడు. ధనికుడే కులీనుడు. భాగ్యవంతుడే దాత. శ్రీమంతుడే వక్త. వేయునేల సకలగుణములు ధనమునందే యున్నవి. ధనములేని విద్యయు, నైశ్వర్యములేని రూపము, విత్తము లేని గుణములును, శోభింపవు కావున ధనవర్మనే మన హైమవతికి మగనిగా నేర్పరపుడు అని చెప్పగా విని మాతండ్రి నవ్వుచు ఓహో! స్త్రీస్వభావము వెల్లడిచేసితివి గదా! ఇదివరకు విద్యాధనముల విషయమై పెక్కండ్రు తర్కించి ధనముకన్న, విద్యాధనమేయధికమని స్థిరపరిచిరి. సమస్తదేశమాననీయ మగు విద్యకన్న ధనమెక్కుడా? ఎంతధనమున్న నేమి, విద్యాగంధము లేనివాడు ద్విపాదపశువు. విద్యవలన దెలివి యభివృద్ధియగు తెలివిగలవా డెద్దియోమార్గమున ధనము సంపాదించుకొనగలడు. అపండితునియొద్ద నున్నవిత్తము రిత్త యైనచో మరల నెప్పటికిని సంపాదింపబడదు దీనిగుఱించి పూర్వ మొకపండితుడు పరీక్షించి ధనికునికన్న విద్యాధికుడే యధికుడని గ్రహించెను.

చంద్రమతీ! ధనవర్మ యెంత ధనికుడై నను విద్యాశూన్యుండగుటచే మాననీయుడు కాడు. ధనహీనుడై నను, గుణవర్మకే మనపట్టి నిత్తము. నీవు సమ్మతింపుమని పలుకగా విని మాతల్లి ప్రాణవల్లభున కిట్లనియె.