పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

కాశీమజిలీకథలు - మూడవభాగము

హైమవతి కథ

20వ మజిలీ

వత్సా! విను మప్పు డప్పడంతియు నతని వృత్తాంతము వినుటచే దన హృదయపరితాప మభివృద్దియైనట్లు సూచించుచు, దీర్ఘనిశ్వాసమారుతములచే వాతెరపోడిమి చెడ గన్గొనలఁ గ్రమ్మిన నశ్రుజలమ్ము గొనగోరఁ జిమ్ముచుఁ బికస్వరముతో మెల్లన నిట్లనియె.

ఆర్యా! సైంధవలవణమును, ఆటవికామలకమును గలసినట్లు విధి విచిత్రసంఘటనల గావింపుచుండును. ఒకానొకప్పుడు దుఃఖము సుఖమునకును, సుఖము దుఃఖమునకునుఁ గారణమగునని చెప్పిన పెద్దలమాటలు నిక్కువములగును. నా వృత్తాంతము వినుటచే నార్యునకు విస్మయమును, సంతాపమును గలుగకమానదు. ఆర్యుని కులశీలనామములు వినినదిమొదలు నాహృదయపరితాప మటమటమైనది. విపత్తులయం దాప్తులు గనఁబడిరేని చింతవాయునుగదా. దేవరతండ్రి కుంతిభోజుడు మత్పితృసఖుఁడగుట నార్యునగు సైతము విదితముకాఁగలదు.

వినుడు మాతండ్రిపేరు మంత్రపాలుడు. మాకాపురస్థలము మగధదేశ రాజధానియైన యమరావతి. మాతల్లి పేరు చంద్రమతి. మాతండ్రి ధర్మంబున రాజ్యంబు సేయుచుండ, లేకలేక, యీశ్వరీకటాక్షంబున నేనుదయించితిని. దానంబట్టి నాకు హైమవతియను పేరుపెట్టిరి. నేను జనించినప్పుడు మజ్జననీజనకులకును బౌరులకును రాష్ట్ర ప్రజలకును గలిగిన యానంద మేమియందును!

మంత్రపాలు డుత్తమబ్రాహ్మణుల కనేకదానములు గావించెను. బాల్యంబుననే నా యాకృతివిశేషము జూచి బంధువు లచ్చెరువు నొందుచుండిరట.

అప్పటినుండియు మాతండ్రికి నావివాహవిషయమై చింత యంకురించియే యున్నది. కావున మదీయప్రాయముతోగూడ నదియు నభివృద్ధినొందదొడంగినది.

దానంజేసి నాకు మాతండ్రి తగినవరునరయుటకై అనేకదేశములకు చిత్రపటములు పంపదొడంగెను. మఱియు నేను సమారూఢయౌవననై యున్నతఱి బ్రసిద్దిచెందిన రాజకుమారుల లెక్కగొనినప్పుడు మిమ్ముంగూడ గణియించినట్లే జ్ఞాపకము వచ్చుచున్నది. మీ చిత్రపట మిదివరకు నేను జూచితిని నేను సమ్మతించి మజ్జనకున కెఱింగించినంత వారును సంతసించుచు మిత్రుండైన కుంతిభోజునకు వార్తనంపదలంచి నంతలో మీకు మఱియొకచోట వివాహము నిశ్చయించినట్లు తెలిసినది.

అప్పుడు నేనును మా తల్లిదండ్రులును మిక్కిలి పశ్చాత్తాపము చెందితిమి. తరువాత దూతలను దేశములన్నియుఁ ద్రిప్పినంత గళింగదేశప్రభువగు వీరపాలునికుమారుడు గుణవర్మయనునాతడును, లాటదేశప్రభువగు సూరపాలుని కుమారుడు