పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవశర్మ అను బ్రాహ్మణుని కథ

271

యొకత్రోవంబడిపోయెను. అట్లు పోయిపోయి సాయంకాలముకొక యూరు చేరెను. అందెవ్వరేని యెరంగినవారు గనంబడి పల్కరించిన నెంత చిత్రమనుమాట తప్ప మఱేమియు నుత్తరమిచ్చుటలేదు. దానంజేసి ఆతనికి వెఱ్ఱియెత్తినదని యూహించి యా యూరి బ్రాహ్మణు లతని బలాత్కారముగా దమయింటికిం దీసికొనిపోయి భోజనము పెట్టుచుందురు.

అట్లుండ దేవశర్మ యొకనాడు రాత్రి గ్రామములో నెచ్చటను బండుకొనక యూరి కనతిదూరములోనున్న శ్మశానవాటిక కవ్వలిభాగమున నొక శూన్యదేవీభవనం బుండుటచే దాని ప్రక్కను బరుండి భగవంతుని ధ్యానింపుచుండెను.

ఇంతలో నొకపురుషుడు చక్కగా నలంకరించుకొని యాగుడిలో ప్రవేశించెను మఱికొంతసేపటికి నొక్క చక్కని చక్కెరబొమ్మ శిరంబున గండదీపము పెట్టుకొని యుపహారము లెన్నియేని దెచ్చి యా గుడిలో దూరి తలుపువైచికొనినది దేవశర్మ యాగోడదాపుననే చీకటిలో బరుండియున్నకతంబున గండదీపముతో చండికాలములో బ్రవేశించిన యా చంచలాక్షింజూచి రూపమున కక్కజమందుచు నా గుడిదెస జెవి యొగ్గి వినుచుండెను. అప్పుడిట్టి సంవాదంబు వినంబడినది.

పురుషుడు ౼ సుందరీ! నీవల్లనాడు సాయంకాలమున జక్కగా నలంకరించుకొని మీ యింటిద్వార దేశంబున నొయ్యారముగా నిలువంబడి యాదారిం బోవుచున్న నన్ను గ్రీగంటిచూపున జూచితివి జ్ఞాపకమున్నదియా?

స్త్రీ -- జ్ఞాపకము లేకేమి? అదియేకదా మనకు బ్రథమావస్థ. అప్పుడే నాడెందము నీయందు లగ్నమైనది.

పురుషుడు - కుసుమచాపుడు నీ చూపులే తూపులుగా జేసి నను గొట్టినందున దగనిబాధం బడితినిగదా?

స్త్రీ - నేనో! అయ్యో అది బాధయో కాధయో చెప్పజాలను. అన్నము రుచింపదు, నిద్రపట్టదు, ఏమియుం దోచదు. ఎద్దియో యనుభూతమగువేదన హృదయంబున బాధింప దొడంగినది. ఒకనా డేదియుం దోచక మా పెరటిలోనున్న కదళీతరుకాండంబులఁ గౌగిలించుకొని నిన్నే ధ్యానించుచుండ నీజోగురాలు ముష్టికై మా యింటికి వచ్చి నన్నుజూచి గ్రహించి మెల్లగా పరితాపకారణంబడిగిన యథార్ధంబు వాక్రుచ్చితిని. ఆ పుణ్యాత్మురాలే నిన్ను వెదకి దీసికొనివచ్చి నా యభీష్టము నెరవేర్చినది. కటకటా! ఇట్టి బాధ శత్రువులకైన రావలదుగా.

పురుషుడు - అగునగు నది మంచిప్రోడయే. ఈ యుపాయము చెప్పినది అదియే నీవార్త నాకెఱింగించిన పిమ్మట మాకు సంఘటన మెట్లని యడిగితిని. అప్పుడది ఈ భూతావేశప్రకటన మంతయు బోధించి నీయొద్దకు వచ్చినది. నీవు మొదట నెట్లభినయించితివో చెప్పుము.

స్త్రీ - నాకు మన్మథభూతం బావేశించియున్నది. కావున స్రుక్కియుంటిని