పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

కాశీమజిలీకథలు - మూడవభాగము

గదా, అది రోగవికార మనుకొని మావారు మందులిప్పించుచుండిరి. నీవాజోగిరాలిచే వార్తనంపిన పిదప నొకనాడు రాత్రి యూరక యేడ్వ మొదలుపెట్టితిని.

పురుషుడు - వనితా! కారణములేక ఏడుపు యెట్లువచ్చినది.

స్త్రీ - మనోహరా! నిన్ను దలంచుకొనినంతనే పొల్లుపొల్లుగా రాదొడంగినది. అట్టియేడుపు విని మావారు వెరచుచు నేముయేమి యని యడిగిరి నేను దలవిరియ బోసికొని వెఱ్రికేకలు వేయదొడంగితిని. అప్పుడు భూతము పట్టినదని నిశ్చయించి మాంత్రికుల రప్పించిరి. వాండ్రు విభూతిమంత్రించి మీదజల్లిన వారిమీద నుమియుచు గీరుచు దిట్టుచు నీరీతి గ్రూరచేష్టలం గావించితిని. ఇది పెనుభూతము, సాధారణముగా వదలునదికాదని మాంత్రికులు పెక్కండ్రు విసిగిపోయిరి.

పురుషుడు - మేలుమేలు! మంచి యభినయమే చూపించితివి తరువాత?

స్త్రీ -- అది మీరు నేర్పినదియేకాదా! పెక్కు లేల? మీరాకవేచి యెన్నితిట్టులో పడితిని ఎన్ని వేషము వేసితిని. మీరును గడుసువారే, భూతవైద్యుండనని వచ్చినప్పుడు మిమ్ము మొదట తిన్నగా జూడక వెనుకటిమాంత్రికులనట్ల యెదిరించితిని. నే నెవ్వండ ననుకొంటివి, తిన్నగా జూడుము. జ్ఞాపకమున్నదా? నీమనోభవభూతము వదల్చువాడ ననువరకు దెలిసికొంటినిసుడీ

పురుషుడు - మనోభవభూతం బను మాటవలన మీవారు గ్రహింపలేదు గదా?

స్త్రీ - ఆ మాత్రమా? నారోగము కుదిరినం జాలునని వేగుర దేవుళ్ళకు మ్రొక్కుచున్నారు అయినను మీరు శ్లేషకవులుగదా!

పురుషుడు - నీతో మీ వారెంతదూరము వచ్చినారు? నేను సాయంకాలమే వచ్చి ఇచ్చట గూర్చుంటిని. నీవాలస్యము చేసితివేమి?

స్త్రీ - అర్దరాత్రంబున జక్కగా నలంకరించుకొని యుపహారములతో గండదీపము నెత్తిపయి పెట్టుకొని యొక్కరితయే యూరిబయటనున్న చండికాలయము లోనికింబోయి యక్షిణికి బలియిమ్మని మీరు చెప్పినదే కాదా? ఆలాగుననే కావించిరి ఇంచుక వ్యతిరేకమయినచో భూతము వదలదని మా వాళ్ళకు భయము, ఇట్లొకనాడే చేయుమని చెప్పితిరేమి? మూడుదినము లయినను జెప్పవలసినది.

పురుషుడు - ఈ మాత్ర మవకాశము దొరికినది. నయముకాదా! ఇంతకన్న నెక్కుడుగా జెప్పిన నమ్మురెరా?

స్త్రీ - అగునగు నామాటయు సత్యమే. ఇదిగో పాపపుకోడి కూయుచున్నది.

పురుషుడు - నిజముగా నది కోడికూతయే అయ్యో! ఎంతలో దెల్లవారినది. అని పలుకుచు దన్ననుసరించియున్న పంచశరుని గృతార్థుం గావించెను.

అవ్వెలదియు దొలిదిక్కు వెలవెల బారుచుండ నఖక్షతంబులం దుడిచికొనుచు వీడిన క్రొమ్ముడి ముడివయిచుకొని కోక బిగియించి రైక గుస్తరించి యొడలు సవరించుకొని తెచ్చినపాత్రంబులు పుచ్చుకొని తలుపులుదీసి నలుమూలలు చూచి తటా