పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

కాశీమజిలీకథలు - మూడవభాగము

కావృత్తాంతము జెప్పెను. అప్పుడా యజమానుడు గొలుసులను పగ్గములు దూలములు గంపను పెక్కులు దెప్పించి యీతకు గడదీరిన ప్రోడలను కొందఱినందు దింపెను.

అజ్ఞాని హృదయంబువోలె గాడతమోమయమైన యాకూపములో వాండ్రు దైర్యముతోదిగి నీటిమట్టమున గొలుసులపై నిలిచి పరిశీలించి చూడ ధర్మశిలలపై దలలజేర్చి చేతులతో బిగియబట్టుకొని వివశులై యున్న రాజపుత్రు లిరువురును గనంబడిరి.

వారింజూచి చోరులిందు డాగియున్నారని తలఁచి తమ్ము బరిభవింతురను వెరపుతో దొంగలు దొంగలని యరచుచు వడివడి యాగొలుసులనుండి పైకి బ్రాకికొనివచ్చి యా వృత్తాంత మా యజమానునికి జెప్పిరి. తరువాత నానూతిలోని కెవ్వరిని దిగుమనినను వెరపుచే సమ్మతించిరికారు.

అప్పుడా యజమానుఁడు పెద్దయెలుంగునఁ జోరులారా! మిమ్ములను నేను గాపాడెదను. మీ రీగొలుసు లెక్కిరండు. వెఱువకుడు దీనిలో గొంతసొమ్మిత్తు. నన్నూరక శ్రమపెట్టకుడని యరచియుఁ బ్రతివచనంబు గానక విసిగి యెక్కుడు రొక్క మిత్తునని యందు దిగుటకు బెక్కండ్ర ప్రతిమాలుకొనియెను.

విత్తమున కాసపడి గారాసులు కొందఱు సమ్మతించి కట్టుగా నానూతిలోనికి దిగి యా రాజపుత్రులం గాంచి పల్కరించి ప్రతి వాక్యంబు వడయక కొట్టబోయి యంతలో దైవప్రేరితమైన బుద్ధిచే నెత్తిన దండములు దింపి దాపునకుబోయిచేతుల నంటి కదల్చి కదలకున్న జూచి యూపిరిపరీక్షించి అయ్యో యీ దొంగలిందుదుమికి రాయిడిచే జేతనముంబాసిరి ఇక వీరింజూచి వెరవనేల. ఈశవము లేమిచేయగలదని యావార్త నా యజమానునికి దెలియజేసి యతని యనుమతిని వారి నిరువురను గంపలలో గూర్చుండబెట్టి త్రాడు గదిపిన వారిం బైకిలాగిరి.

అప్పుడు వికృతముగానున్న వారి శరీరములు చూచి యా యజమానుడు అయ్యో! ఇది యేమి. దొంగ లిందాకనే యిందు బెట్టెలు పారవైచిరని చెప్పిరే. వీరా దొంగలుకారు. నీటిలో నుండుటచే వీరిమేనులు దెల్లబడినవి. ఇంతలో నిట్టివికృతిని బొందనేరవు. వీరివలననే యీ వృత్తాంతము వినవచ్చునని పల్కుచు నతండు అన్నమును మజ్జిగయు దెమ్మని తమదూతల నూరిలోని కనిపెను.

ఆ దూతలు తృటిలో బోయి వానియాజ్ఞ చొప్పున నాహారవస్తువులం దెచ్చిరి మిక్కిలి సాధనముగా నతిదయాళుండైన యా యజమాను డాహారము వారినోట నెక్కించి మంటలువైచి కాపించి పండుకొనబెట్టెను. అప్పుడు వారిమేనుల చెమట పట్టినది. ఇంక జీవింతురని చెప్పుచు నింతలో నూతిలో దొంగలు పారవైచిన మందసములన్నియు గూలివాండ్రు తీసినందున వాని నన్నిటిని బండిమీద నెక్కించుకొని యా రాజపుత్రుల నాందోళికములమీద మెల్లగా దనయింటికి దీసికొనిపోయెను.

ఆ యజమానుడు చేసిన యుపచారములవలన నారాజపుత్రుల కామరునాడే