పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

259

స్మృతివచ్చినది. అతడు చేసిన యుపకారమునకు వారు మిక్కిలి సంతసించుచు దమ వృత్తాంత మంతయు నతనికి జెప్పి యతని మన్ననల వడసి, కొన్ని దినములందుండి శరీరములు స్వస్థత పడిన కొన్ని దినములకా యజమానుని యనుమతివడసి వెడలి కతిపయప్రయాణంబుల గరిపురంబునకు జనిరి.

అప్పురంబు రాజమార్గంబున జనుచున్న సమయంబున నొక భవద్వారంబున వీణావాదన పరీక్షామందిరము అనియున్న ప్రకటన పత్రికజూచి చంద్రుడు విజయునితో అన్నా! యీ ప్రకటన చూచితివా యిచ్చటివిశేషము లెట్టివో పరీక్షించి పోవుదమురమ్ము అనుటయు విజయుడు ఇప్పుడు ప్రొద్దెక్కినది. రేపువత్తుములే. ఎచ్చటను వీణ పేరు కనంబడనీయవు. నీ వీణ యిచ్చటికి వచ్చినదను కొంటివా యేమి.

అని మాటాడుకొనుచున్న సమయంబున నాలోపలినుండి యెవ్వరో వాకిటికి వచ్చిరి. చంద్రుడు వారింజూచి అయ్యా! యీ ప్రకటన యేమియది. వీణాగానము పరీక్షింతురాయేమి యని యడిగిన నందొకడు అగునగు నిందొక విపరీతపు వీణయున్న యది. అది పెక్కండ్ర గాయకుల బరిభవించినది. దాని శ్రుతివైచి పాడిన వారికి బారితోషిక మిప్పింతునని మా రాజపుత్రిక ప్రకటించినది. మీరు పాడగలిగిన జూడుడని పలికెను.

ఆ మాటవిని చంద్రుడు విజయుని చేయిపట్టుకొని దాని నిప్పుడు చూచివత్తం రమ్మనిపలుకుచు లోపలకు బోయెను.

అందు విశాలమగు చావడిలో బీఠంబున నొక వీణయుండుటయుం చంద్రుడు దాపునకుబోయి చూచి మొగము వికసింప అన్నా! యిది నాదియే నాదియే యని అరచుచు నతని కౌగిలించుకొనియెను.

తమ్ముడా! వేగిరింపకుము నిదానించి చూడుము అట్లుగంతులు వైచెదవేల? చూచినవారు నవ్వరాయని పలికిన నతండు సందియములేదు. అదిగో చూడుము. వీర బ్రతాప కుమారచంద్రయని నా పేరు కనంబడుచున్నది. ఆ పేరు నా ప్రియురాలు దీని నాకిచ్చినపుడు స్వయముగా జెక్కినది హా చారుమతి, నిన్నుజూచి ఎన్ని దినములయినదే. వెండియుం గనఁబడుదునా? రామా! సోదరుఁడవయ్యు నెంతపని జేసితివిరా. యని యున్మత్తాతాపములు పల్కుచున్న చంద్రుని వారించుచు విజయు డందున్న యధికారులతో, అయ్యా! మేమీవీణను మేలగించి పాడగలము దీనమాకు గలుగులాభమెద్ది! మీ రాజపుత్రిక యెవ్వతె ఆమె యిట్టి నియమమేమిటికి జేసినదని యడిగిన వారు ఆ వృత్తాంతమంతయు మాకు దెలియదు మీరు పాడగలిగిన మీ పేరులు సెప్పుడు. రాజపుత్రికకు జూపి శాసనము చేయించుకొని వత్తుము. ఇంతకు మున్ననేకులు వచ్చి యీలాగుననే పలికి చివరకవమానము పొందిపోయిరి. చక్కగా నిదానించి చెప్పుడని పలికిన దానికి సందియములేదు. నిక్కముగా బాడగలము. మేలగించలేక పోయితిమేని మా ప్రాణములు ఫణముగా జేసెదము. దీనికి మెచ్చి మీ