పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(32)

రాముని కథ

257

నందఱు ధర్మశీలుని పేరున కట్టఁబడియున్న పాషాణములుండుటఁ దిలకించి వాని నూతగాబట్టుకొని కొంతసేపటి కాయాసము దీర్చుకొనిరి.

అప్పుడు విజయుడు, చంద్రునితో తమ్ముడా నీవు నామాట వింటివికావు. వీరి నప్పుడే పరిభవించిన నింత రాకపోవనుగద. ఎట్టి పనిచేసిరో చూచితివా? ఇప్పుడేమి చేయగలము. ఇందుండి కేకలు వైచినను బై వారికి వినంబడవు. మహారణ్యమగుటచే నీదారిని నడుచువారు తఱుచుండరు. ఎవ్వడేని వచ్చినను మిగుల విస్తీర్ణమగు పగ్గం కాని గొలుసుగాని దెచ్చునా, అట్టిదిలేకున్న నతడేమి చేయగలడు ?

అయ్యో? మనకు యీత రాకున్నను జక్కనగుంగదా. వెంటనే మునింగి ప్రాణములు పోగొట్టుకుందుము. ఇప్పుడాహారములేక చివికి చివికి చావవలసిందే. ఏమిచేయుదుము రక్షించువారెవ్వరు?

అన్నా ! మహారాజు గర్భంబున జనియించి పెక్కు విద్యులనేర్చి మంచి బుద్దిమంతుల మనిపించుకొని తుదకీనూతిలో బలవన్మరణము నొందవలసివచ్చెనా? హా! విధీ?! ఎంత క్రూరుఁడ వై తివిరా? యని దైర్యము చెదర బెదురుదోప గోలున నేడ్చినంజూచి వారించుచు చంద్రుండిట్లనియె.

అన్నా! నీవింత బేలవైతివేమి? పుట్టినవారి కెప్పటికైనజావు నిక్కువ మేకద. అని యెఱింగియు దానికి శోకించుట ప్రాజ్ఞత్వముకాదు. అదియునుంగాక భగవంతుం డెవ్వని కెందెట్లు చావు వ్రాసెనో అట్లు జరుగకమానదు. కొంతకాలము దుఃఖము కొంతకాలము సుఖము ననుభవించుట మానవధర్మమై యున్నది. దేనికిని మనము స్వతంత్రులము కాము. మన కర్మకు గర్మయే కారణము. అది యెట్లులాగిన నట్లు పోవుచుందుము. ముందు మనకుమించి కర్మయుండిన నెప్పటికైన మందురావచ్చును వెనుక నేనుపడిన చిక్కులలో నిదియొక లెక్కా? నీవును వినియుంటివికదా? యని యెంతో దైర్యముతో దగుమాటలు చెప్పి యతనికి శోకము వాయ జేసెను.

అట్లు వారిరువురు మూడు దినములు దైర్యము విడువక గడియ యుగములాగున గడిపిరి అంతకంతకు నాఁ లి బాధింపుచుండ బెండుపడి యొడలి సారమడుగు చుండ నొడలెఱు గక యా ధర్మపాషాణమానుకొని కాళ్ళు దేలవైచుచు మాటాడుట కైన నోపికలేక కన్నులు మూసికొని యా నూతిలో మఱినాలుగు దినములు గడపిరి అప్పటికి స్మృతి దప్పినది. తలవాలవైచుకొని యారాతినానియున్న సమయంబున దైవికముగా నా ప్రాంతమందలి యూరిలో నొక భాగ్యవంతుని యింటికి దొంగలు కన్నమువైచి, వెండిబంగారములతో నిండియున్న పెట్టెనెత్తుకొనిపోవుచుండ జూచి యా యింటి యజమానుడు పదుగురితో వారిందరిమికొని వచ్చెను.

చోరులు పెద్దదూరము పెట్టెలతో బాఱిపోయివచ్చి యింక పట్టుకొందురని వెరపుగలిగినప్పుడు దైవగతి నాకూపము చేరువున నుండుటచే నామందసము లానూతిలో బారవైచి పాఱిపోయిరి.

ఆ గ్రామస్తులలో నొకడది జూచి వేగముపోయి యెదురుబడిన యాయజమాని