పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

255

చూచివచ్చెదను. ప్రొద్దుపోయినది నిద్రబోవుదము. రుచిరకు నిద్రపట్టినది కాబోలు.

నాలుగుదినములనుండి నిద్రలేదు. చిన్న కన్నము వేసితిమి దాని గురించి కొన్ని చిక్కులు వచ్చినవి. దాటినవిలే! రాత్రికి రాత్రినడిచి యింతదూరము వచ్చితిమి. అందు మూలమున నిద్రపోయినది. లేకున్న మనకన్న నెక్కుడుగా మేల్కొనును.

అని లోపల రాముడును భానుడును ప్రొద్దుపోవుదనుక మాటలాడికొని నిద్ర పోయిరి. ఆమాటలన్నియు విజయుడును జంద్రుడును విని వెరగుపడుచు వారి తమ తమ్ములుగా దెలిసికొని యందొకచో వసియించి యిట్లు తలంచుకొనిరి. తమ్ముడా భానుడుచేసిన క్రూరకృత్యము వింటివా? నామెడమీద గత్తివైచి నాప్రియురాలిని బలవంతముగా నడవికి దీసికొనిపోయి తనమాట వినకపోయినందులకు నూతిలో బడద్రోసెనట. అయ్యో! యెంతకష్టము యీక్రూరవార్త నాచెవినేల పడవలయును. నాకతంబున నాసతీరత్నమున కెన్ని యిడుములు వచ్చినవి. ఇట్టిపాపాత్ములు కటికివాండ్రకుఁ బుట్టక యుత్తమక్షత్రియున కేమిటికి బుట్టిరో తెలియదు. వీరినిరువుర నిప్పుడే నఱికివేసెద. గటారి నిటుదెమ్మని యలుకయు శోకమును మదిగుదింపఁ బలికిన విజయుని వారించుచు జందు నిట్లనియె.

అన్నా! మావదినెకేమియు భయములేదు. జీవించియేయున్నది. వెంటనే యా నూతియొద్దకు వచ్చిన బ్రాహ్మణునివలన గాపాడబడియుండును. నామాట నమ్ముము. వీండ్రు మనకు సోదరులు. ఎట్టివారైనను మనము భరించి బుద్దిచెప్పవలయుగాని సంహరించుట యుచితముకాదు. మసగాత్రము చెడ్డదైన నేమిచేయుదమని యెన్నియో నీతివాక్యములు చెప్పి యతిని కోపము చల్లారజేసెను.

అంతలో దెల్లవారుటయు వారును వీరును సత్రముఖంబునం గారసిల్లిరి. విజయుని జంద్రునిం జూచి వాండ్రు తెల్లపోవుచున్న సమయంబున వీరిరువురును తమ్ములారా! కుశలముగా నుంటిరా! యని పల్కరించి కౌగిలించుకొనినంత వాండ్రును తత్సమయోచితముగా బ్రత్యుత్తరము లిచ్చిరి. అప్పుడు భానుడు అన్నా! ఆల్ల నాడు నీవును వదినయు దూరముగాఁ జెట్లక్రింద పరుండియుండ నేనొక చెట్టుక్రింద బండితి అప్పుడొక పెద్దపులి నాపయిబడివచ్చినఁ బాఱిపోయితిని. అదియు బెద్దదూరము నన్ను దరుముకొని వచ్చి దొరకంపోవుటచే నెచ్చటికో పోయినది.

తరువాత గొన్నిదినములకు వెఱపుడిపికొని మునుపటిచోటికి వచ్చితిని. మీ రెవ్వరు నచట గనంబడలేదు. అది మొదలు మీకొరకే వెదకుచుంటినని విజయునితో చెప్పెను.

పిమ్మట రాముడు తమ్ముడా! నీవాసత్రములో వేఱొకగదిలో బరుండితివికదా. నాడు యర్ధరాత్రంబున మమ్ము విమర్శించుటకై రాజభటులు లచ్చటికి వచ్చిరి. ఆజాడ దెలిసి మేము నీతో చెప్పకయే పారిపోయి వచ్చితిమని చంద్రునితోఁ జెప్పెను