పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

కాశీమజిలీకథలు - మూడవభాగము

పొడుచుచు నొకలతామంటపమునఁ బుష్పశయ్య కల్పించి యందు మా యిరువురను గూర్చుండజేసి మనోభవక్రీడాయోగ్యంబులైన వినోదము లనేకములు గావించిరి. అన్నా! యికజెప్పనేల? అప్పుడాసుందరితో నిర్వాచ్ఛమైన యానందమనుభవించితిని.

అట్లక్కాంతతో గొన్నిదినంబులందు సుఖముగా గడిపితిని. నేనా గుహాంతరమున నివసించియుండ జారుమతియు, శివపూజాకైతవమున వచ్చి పెద్దతడ వచ్చటనే యుండి యేగునది, ఒకనాడెద్దియో ప్రస్తావముమీద మీనిమిత్తము తండ్రిచేసిన నియమమతి క్రమించితినని చెప్పగా నన్ను బిల్వవృక్షము క్షేత్రములన్నియుం ద్రిప్పిన వృత్తాంతమంతయుం జెప్పితిని. అప్పు డపారసంతోషముఁ జెందుచు నయ్యిందువదన తన తల్లిదండ్రుల కత్తెఱంగెఱిగింపఁ దలంచిన మల్లిక వారించుచు వారు నీకు వివాహప్రయత్నము చేయునప్పుడు చెప్పవచ్చునని యుపాయము సెప్పినది.

ఇంతలో మీవృత్తాంత మంతఃకరణంబునఁ దోచిన నొకనాఁడాచిగురుబోఁడిం జూచి పైదలీ? నాసోదరులతో వత్తునన్నకాలము మించియుండవచ్చును. నీగుహలో ప్రవేశించినది మొదలు నాకు దినరాత్రి భేదము తెలియుటలేదు. మేము నలువురము సోదరులము నలుదిక్కులకు గన్యాగ్రహణార్దమై పోయితిమి. సంవత్సరము మితి ఏర్పరచుకొంటిమి కావున నమ్మితిని నేను బోవలయును. వారు నారాక వేచి యుందురు. వారెట్టి భార్యలను స్వీకరించిరో తెలియవలయును. పోవ ననుగ్రహింపుమని నావృత్తాంతమంతయు జెప్పితిని.

అప్పు డప్పడంతి సంతసించుచు దనకప్పటికి నెలదప్పెను గావున బతిసంపర్కంబు దూష్యమగుట నేనరుగుట కెట్టకేలకు సమ్మతించి యొక వీణె నాకిచ్చి యపూర్వరాగంబొండు సూపి మీరేకాంతముగాఁ గూర్చుండి యీవీణమీద నీరాగము నెప్పుడు పాడుదురో యప్పుడు మీయొద్దకు నేనువత్తును. మేము యక్షకాంతలమగుటచే నట్టి సామర్ధ్యముమాకు గలిగియున్నది. ఈ రహస్యం బెవ్వరికినిఁ దెలియనీయకుడుఁ కావలసినప్పుడు రప్పించుకొండని పలికిన సంతసించుచు నేనావిపంచి పుచ్చుకొని మచ్చకంటీ! నేనీ గుహాంతరమునుండి యెట్లుపోవుదును? మొదట నతిప్రయత్నముమీద వచ్చితిని. అమ్మార్గము దలంచుకొన వెరపగుచున్నది. మరియొకదారిని నన్ను జనపదంబుల కనుపుమని కోరిన నా నారీరత్నము నవ్వుచు మల్లికంజూచి కనుసన్న చేసినది

అప్పుడామల్లిక నన్ను రమ్మని యొక గుహామార్గమునం దీసికొనిపోయి రెండుగడియలలో శ్రీశైలములో విడిచి యనుజ్ఞ పుచ్చుకొని ఏగినది. ఆ మార్గము వారికిగాక యితరులకు దెలియదు. నేను శ్రీశైలమున మల్లికార్జునదేవు నారాధించి యందుఁ గదలి యనేకజనపదంబులు గడచి యుజ్జయినికిం బోయితిని.

అందు విక్రమార్కస్థాపితంబయిన సత్రంబున కరిగి యరయ నరయ నొక గదిలో మనరాముడు గనంబడెను. అతండేమిటికో విచారింపుచు నన్ను విమర్శింప