పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

247

డయ్యె. నేనతనిం గౌఁగిలించుకొని అన్నా ! నన్ను గురుతుపట్టలేక పోయితివా? నేను నీ తమ్ముండ చంద్రుండ. నీవిచ్చటికివచ్చి యెన్నిదినములైనది. ఎచ్చటెచ్చటికిఁ బోయితివి? ఏమేమి వింతలం జూచితివి? మన సోదరులు వచ్చియున్నారా? సొమ్మంతయు నేమిచేసితివి? భార్యను స్వీకరించితివా? నీవృత్తాంతము చెప్పుమని యడిగిన నన్ను జూచి సంతసించుచు స్వాగతమడిగి తన కథ యిట్లు చెప్పందొడంగెను.

రామునికథ

తమ్ముడా! మనమందర మొక్క సారియేకదా పట్టణము విడిచితిమి. నేను ధనమంతయు గుఱ్ఱములమీద నెక్కించుకొని పశ్చిమదేశమున కేగితిని. అందొక అరణ్యమార్గమున బోవుచుండగా దొంగలగుంపు మాపై బడి మమ్ము బ్రాణావశిష్టులనుజేసి సొమ్మంతయు దోచికొనిపోయినది. అప్పుడు నేనొక్కరుఁడ నొకమార్గంబునం బాఱిపోయి యాయడవిలో నడువ నడువ నొకపల్లె గనంబడినది. అందొక రెడ్డియింటికి బోయి యన్నంబు యాచించితిని ఆ రెడ్డి నన్ను మన్నించి నావృత్తాంతమంతయు విని కనికరముతో నన్ను గొన్ని దినంబులు తన ఇంట నుంచుకొని యుపచారములు గావించెను. ఆరెడ్డి దొంగలకురాజు. ఆ దేశములోనున్న దొంగలు ప్రతిదినమువచ్చి దోచుకొనివచ్చిన సొమ్ములు తెచ్చి ముందుంచిననవి యందరకు బంచియిచ్చుచుండును. మఱియు నాయదారులు కొట్టుమనియు నాయూరులు దోచికొమ్మనియు నాలోగిళ్ళకు గన్నములు వేయుమనియు నందరకు నియమించుచుండ నాపనులం జేసికొనివచ్చు మ్రుచ్చు లెల్ల నారెడ్డికు జరిగిన కథలన్నియు జెప్పుచుందురు.

సీ. కళలనేయుచు నెఱుంగ మెఱుంగ మనుమాటఁ
            బలుకగాఁ గఱపుఁ బిడ్డలకు నొకటఁ
    గోలలూతగఁబూని గురుకుడ్యములదాఁటు
            నేరుపు దీరుగా నేర్చునొకటఁ
    గన్నముల్ ద్రవ్వించి కనుబ్రామివస్తువుల్
            దెచ్చు పాటవము బోధించు నొకట
    నడచిపట్టిన మారువడి విడిపించుకో
            గల లాఘవంబులఁ దెలుపునొకటఁ
గీ. నెదుటఁబడువారి కనులలో నిలువల్లు
    బోలిఁ బైఁ బడువారిపై రాలరువ్వు
    టాదిగాఁగల చోరవిద్యా ప్రసక్తి
    ననుదినము వాఁడు బోధించు జనులకందు

తమ్ముడా! నీయొద్ద దాచనేల? పదిదినములలో నామాటలు వినుచుండ సులభ