పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

కాశీమజిలీకథలు - మూడవభాగము

మంటపమున నిన్ను బూజించెడి యించుబోణి నాకు భార్యగా జేయుదుని పలికి ధ్యానించి భూమిదిక్కు. మొగంబయమును జూచిన పాషాణమున జూడ నేదియు గనంబడినదికాదు.

అప్పుడు నలుమూలలు జూడ నన్నావృక్షమెచ్చటికో తీసికొనిపోవుచున్నట్లు పొడగట్టినది. శ్రీశైలమందు సంచారవృక్షములున్నవని పురాణములో వినియున్న వాడ గావున నది సంచారవృక్షమనియు నన్నెచటికో తీసికొనిపోవుచున్నదనియు దలంచి విధివియోగమునకు విస్మయము జెందుచు నాచెట్టుకొమ్మను బిగ్గరగా బట్టుకొని కన్నులుమూసికొని యాస్ఫటికశిలామంటపమునే ధ్యానింపుచుంటిని. ఆహా! యంత్రస్యందనములును విమానములును పుష్పకములు తన్మహనీయతకు సాటివచ్చునా! కుదుపేమియులేదు. నడచినట్లే యుండదు. వేగమును గొనియాడుచున్నంతలో నాకు మనుష్యుల కోలాహాలము వినంబడుటయు గన్నుల దెరచి చూచితిని.

అప్పుడు మహోన్నతములైన మేడలచే నొప్పుచున్న యొక పట్టణము నడుమ నొక దేవాలయముపొంత నాపాదపము నిలువంబడినట్లు కనంబడినది. ఆ దేవాలయములోనున్న శివలింగమున కనేకులు నానావిధాభిషేకపూజానమస్కారములు గావించుచుండిరి. అవినోదము చూచి నేను మిక్కిలి వెరగందుచు నది యే దేశమో యాస్వామి పేరెయ్యదియో తెలిసికొనవలయునని తలంపుగలిగి యా చెట్టు దిగ బ్రయత్నించునంతలో, అయ్యో! యీతరువు నేను దిగి తిరిగి వచ్చువరకు నిందుండునా? కామగమనము గలది. అదియునుం గాక దీని వదలితినేని యగోచర మగునని తలంచి యావృక్షమును విడువక యందున్న జనుల ప్రార్థనల నాలింపుచుండ నిట్లు విననయ్యె. జయవిశ్వనాథాై! వారణాశీకృతవాస! అన్నపూర్ణా! మనోహరా! భాగీరధీ జలాభిషేకసంతుష్టాంతరంగ! జయహర! హరఃమహాదేవ! శంభో! శంకర ! పాహియని కోలాహలముగా స్తుతిజేయుచున్న నినాదము లాలించి పులకితాంతుండయిన కాశీపట్టణము భక్తజనరక్షకుండైన విశ్వనాధుని బొడగంటిని. కృతార్థుండనైతినని సంతసించుచున్న సమయంబున నంతలో నాగుడి యంతర్దానము నొందినది. తద్వియోగమునకు గుందుచు నలుమూలలు బరికింపుచున్నంతలో నా ప్రాంతమందు బ్రాకారగోపురాదులచే నలంకృతంబగు మఱియొక దేవాలయము జూడనయ్యెను. దాని నిరూపించి చూచి విశ్వనాథు దేవళము కాని యట్లు నిశ్చయించి యది యయ్యెదియో యని విమర్శింపుచున్నంత నాప్రాంతమందలి జనుల స్తోత్రపాఠములచే నది రామలింగేశ్వరునియాలయంబై నట్లు తెల్లమైనది. తదీయ ప్రాకారాదుల విమర్శించునంతలో నాయాలయ మగోచరమై వేఱొక కోవెల గన్నుల పండువు గావించినది. అది మునుపటిరీతి గేదారేశుని నివేశమని యెఱింగి యంతరంగ ముప్పొంగ నప్పరమ శివలింగము నుతియింపుచున్నంత నదియు నంతర్ధాన మైనది. పెక్కులేని నీరీతి క్షణమునకొక యాలయము గనంబడ దొడంగినది.