పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రుని కథ

235

అప్పుడు నేను దైర్యముతో మంటపము మీదికి వచ్చి మనంబున నిట్లు తలంచితిని. ఆహా! యీ మోహనాంగులు సౌందర్యమునకు దుదివారు. ఈ లావణ్యవతుల యౌవనము సుపమానభూతముగా జేసికొనవచ్చును. ఇట్టివారి జూచుటచే నాకన్నుల కలిమి సార్థకమయినది. వీరిలో నీశ్వరు నారాధించిన యువతి ప్రధానురాలుగా గనబడుచున్నది. భర్తృదారిక యని పిలచుటచే రాజపుత్రి యని యూహించెదను. వీరి మాటలచే కులశీలనామంబులు తెలియంబడలేదు. దివ్యాంగనలగుట నిక్కువము. వీరీ గుహామార్గంబునం బోయిరి గదా! దీనిఁబడిపోయి నేనును వీరి నివాసం బరసి వచ్చెదంగాక యని నిశ్చయించి యమ్మార్గంబునం బడిపోయినంత గొంతదూరములో మునుపటి రెండు దారులు గనంబడినవి.

ఎడమప్రక్కదారి యెఱింగినదే కావున గుడిప్రక్క మార్గంబునంబడి పోయితిని. కొంతదూరము పోయినంత మఱియొకచోట రెండు ద్వారములు గనంబడినవి. అక్కడ నిలువంబడి యోహో! మునుపొకసారి మోసపోయితిని. ఇప్పుడే దారింబోవలయునో తెలియదు. ఎడమ ప్రక్కదారులు గంతవ్యములు కావని నిశ్చయించి కుడి దెసనున్న ద్వారము ననుసరించి పోయితిని. ఆ దారి పోయిపోయి యొక పర్వతము కొనలోనికి దీసికొనిపోయినది పెద్దతడవు నేను గుహవిడిచినదే ఎరుంగక యొకమూలను సూర్యబింబము కనంబడినతోడనే అయ్యో! నేను బయటకి వచ్చితిని. గుహాముఖ మెందున్నది. ఎంతమోసము జెందితిని. సీ! నావంటి మూర్ఖుడులేడు. ఒకసారి యనుభవించియు బ్రమాదమును బొందువాడుండునా? ఆమంటపమును విడువక నివసింతునని తలంచి యిట్టి ప్రయత్న మేమిటికి జేయవలయును. అయ్యిందుముఖులు ప్రతిదినము వచ్చుచుందురు. పరమనిర్భాగ్యుండ, నాకీ ప్రాయశ్చిత్తము కావలసినదే. మునుపు మాతంగము మూలమున నచ్చటికిం బోయితిని. ఇప్పుడెట్లుపోవుదు ఇందు జావవలసినదే యని యనేక విధముల నిందించుకొనుచు నక్కోనలో గ్రుమ్మరు చుంటిని.

అక్కోనయంతయు బిల్వవృక్షములచేత నావృతమై యున్నది. అందు ఫలములం దిని సెలయేరులోని జలములం గ్రోలి యాకలి యడంచుకొని రెండు మూడు దినములు గడపితిని. ఆ గుహముఖమెందేని గనంబడునేమోయని యా యరణ్య మంతయు గ్రుమ్మఱు చుంటిని. ఏదియు గనంబడినది కాదు. మునుపటివలెనే యే జంతుచయిన లోపలినుండి వచ్చునేమోయని యరయుచుంటిని. యే యాధారముగనంబడక యెక్కడికి బోవుటకును దారి తెలియక గుందుచు నొకనాడు ప్రాణములు పోగొట్టుకొనదలంచి యున్నతమయిన యొక మారేడు చెట్టు చిట్టచివరకెక్కి యొక పెద్దపాషాణము గుఱిచూచుకొని దాని మీదబడి శిరము వ్రయ్యలుచేసికొనదలంచిహా! పరమేశ్వరా! భక్తపరాధీన! కరుణాతరంగితాంతరంగా ఏనిప్పుడు భవదాయత్తదత్తుండ నయి మేను బాయుచున్నవాడ. తరువాత జన్మంబుననైనను స్ఫటికశిలా