పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రుని కథ

237

కొన్నిటి నామంబులు తెలిసినవికావు. భూమిలో బ్రసిద్ధములైన క్షేత్రంబులన్నియు నర్థయామమాత్రంబులో వీక్షింపగల్గెగావున నావృక్షరాజమును ప్రత్యక్షదైవమునుగా దలంచుచు నది యెంతవేగముగా బోవునో చూడవలయునని కన్నులం దెరచికొని యున్నాను తద్వేగవిశేషంబుననో మహిమాతిశయంబుననో కాని యేమియుం గనంబడినదికాదు. దిక్కులన్నియు నలికికొనిపోయినట్టుండునవి.

మఱియు నత్తరువరంబు ప్రతిక్షేత్రంబునను నిలిచినప్పుడు దళంబుల విదల్పనవి పతితంబులై వాతాహృదంబులట్ట తత్తల్లింగంబులంబడునవి. అట్టి విశేషములన్నియు జూచుచు నేనానందసాగరమగ్న హృదయుండనై యాహా! అయత్నోపలబ్దముగా నాకఖిలదివ్యక్షేత్రాలోకనసుకృతము గలుగజేసిన మదీయపురాతనభాగదేయంబేతాదృశంబే! సుఖము దుఃఖమునకు దుఃఖము సుఖమునకు నొక్కొక్కప్పుడు కారణంబులగునని చెప్పిన యార్యవచనంబులు యథార్థములగును. నాకిప్పుడు వారణోద్యోగంబే యీయద్భుత విశేషముల జూడజేసినది. ఇంక ముందేమికానున్నదో యెఱుకపడదు నిట్టూర్పు విడచుటకై నను బురుషుడు స్వతంత్రుడుకాడుకదా! ఏదియెట్లయినను వెండియు నొకసారి స్ఫటికశిలామంటపంబున ముక్కంటి నర్చించు నావాల్గంటి గంటినేని గృతార్ధుండ నగుదునని తలంచెద తద్భాగ్యము నాకీజన్మంబున గల్గునాయని ధ్యానించుచుండ నాతరుప్రకాండం బొకకొండప్రక్కను ప్రవహింపుచున్న నదియెడ్డునకుంబోయి నిల్చుటయుం జూచి యందున్న సోపానంబులు గురుతుపట్టి మును పాతాళగంగాజలనయనార్థ మరుదెంచిన మాతంగంబు నెక్కిన చోటిదియేకదా యని తలంచుచు నేనత్యంతసంతోషంబుతో నాబిల్వవృక్షము మెల్లనం దిగితిని అంతలో నది యగోచరంబయినది. తల్లిబాసిన పిల్లవలె నుల్లంబు దల్లడిల్లుచు బెదతడవు దానింగానక వగచితిని.

అందావృక్ష మాగుటకుం గతంబేమని యరయుచుండ నాదండ బాతాళగంగాజలంబుల మట్టంబున గట్టుదెస దట్టంబుగ దీగెలచే జుట్టుకొనబడిన గుజందున బిల్వదళార్చితంబగు శివలింగం బొండు బొడగట్టుటయు బట్టరాని కౌతుకముతో నేనప్పుడు తెప్పున దీర్ధములాడి యాలింగమున కభిషేకము గావించి యాసోపానంబులం గూర్చుండి చూచిన విశేషంబులన్నియు దలంచుకొనుచు మునువచ్చిన వేదండము మరలవచ్చు నేమో యను నా సహృదయమునకు నుదుటు గలుగజేయ గొంత కాలక్షేపము జేసితిని.

అంతలో దైవవశంబున మునుపటి ఏనుగు కనకకలశంబు గైకొని యక్కొండ దిగి యచ్చటికి వచ్చినది. దానింజూచి నేను పెన్నిదింగన్న నిరుపేదయుంబో లె జెలంగుచు నించుక కెలంకువకు దొలంగి యామాతంగము జలంబు ముంచుకొని మెట్లెక్కుచున్న సమయంబుననే నెదురుగాబోయి యది తొండము వంచినంత బైకెక్కితిని. అదియు బూర్వమువలె దృటిలో నా స్ఫటికశిలామంటపము సమీపమున నిలువంబడినంత నేలకుందిగి కన్నులు కరవుదీరునట్లు తద్విశేషములు చూచుచుండ