పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

కాశీమజిలీకథలు - మూడవభాగము

తాభరణంబు లొసంగి కొన్నిదినంబులు తనయొద్ద నుంచుకొని యొకనా డిట్లనియె తమ్ముడా! మన మిల్లువెడలి సంవత్సరము దాటినది. మొదటి సంవత్సరమున కొకసారి కలసికొందుమని నియమము జేసికొంటిమి. మన తమ్ము లచ్చటికి వచ్చి మనకై వేచియుందురు. కావున మన మిప్పు డక్కడకు బోవలయును. ఈ విషయ మిదివరకు మరచితిని. నిన్ను జూడ జ్ఞాపకము వచ్చినదని పలికి యా వార్త భార్యకుం జెప్పిన నాకాంతయు తాను గూడ వత్తునని వేడుకొనినది. అప్పుడు మువ్వురు పోవుటకు నిశ్చయించుకొనిరి. విజయుడు స్వదేశము జూచి వచ్చుటకై రాజునొద్ద సెలవుపుచ్చుకొని యెక్కుడు డాంబికముతో బోయినచో దేశవిశేషములనడుమ దెలిసికొనుట కష్టమని సామాన్యపు ప్రయత్నముతో వెడలి నడుమ జనపదంబులందు వసియించచు దేశవిశేషంబులం దెలిసికొనుచు కొన్ని పయనంబులం గావించెను.

ఒకనా డొకతోటలో బసజేసి విజయుడును భార్యయును గూర్చుండి వినోదముగా మాటలాడికొనుచుండ జూచి భాను డోర్వలేక ఆహా! మేమిద్దరము నొక్కచక్రవర్తికే జనియించితిమి వీనికట్టివైభవము పట్టనేల? నేనిట్టి హీనస్థితి ననుభవించు చుండనేల? దైవమెంత యన్యాయము చేసెను? ఆలాటి బోటితో మాటలాడికొనుచు హాయిగా కాలక్షేపముచేయు భాగ్యము నాకు లభింపకపోయెనే! నేను భార్యలేక నేకాకినై దుఃఖించుచుండ నావంత విమర్శింపక నితండు భార్యతో నెట్లానందించుచున్నాడో? కానిమ్ము? వీడు నిద్రించుచుండ వీని జంపి యీ కాంతను స్వాధీనముచేసికొనెదను. ఇంతకన్న సుఖించుటకు వేఱొక ఉపాయము లేదని తలంచి వారు నిద్రించువరకు పొంచియుండెను.

ఆదంపతులా రాత్రి గొంతసేపు యిష్టాగోష్టి వినోదములచే బ్రొద్దుబుచ్చి యంతలో నిద్రబోవుటయు నట్టిసమయమున భానుడు మెల్లగాలేచి యొక కత్తిదీసికొని యన్యోన్యాలింగుతులై యున్న యా దంపతులంగాంచి యన్నగారి మెడ గుఱిచూచి యాకత్తితో మెడమీదవేసెను ఆవ్రేటుదిని యావిజయుం డమ్మోయనియరచి చేతనములబాపెను. ఆరోదమువిని హేమ యడలుచులేచి నలుమూలలంజూచి మగనిమెడపైబడియున్న యడిదము విమర్శించుచు గుండెలు బాదుకొనుచుండ నప్పుడు భాను డామెను బిగియం బట్టుకొని బోటీ! నీవేటికి జింతించెదవు? మాయన్న పరలోకగతుడయ్యెను వగచిన రాడుగద? నేను నిన్నంతకన్న నెక్కుడుగా సుఖపెట్టెదను. నాతో రమ్మని పలికిన నక్కలికి పెద్దయెలుంగున నేడ్చుచు హా! దుష్టాత్మా! ఎంతపని చేసితివిరా? మిత్రద్రోహీ? సీ మీయన్న నీకేమి యపకారము జేసెనురా? కామాతురుండవై యిట్టి క్రూరకర్మమున కొడిగట్టుకొందువా? నేను నీవశ మగుదునను కొంటివా? నన్నుగూడ నాకత్తితోడనే నరకుము. పుడమి జిరకాలము సుఖింపగలవని నేలంబడిమూర్చిల్లినది. ఆ సమయములో భానుండయ్యిందువదనను సందిటబట్టి యొక గుర్రముపై నెక్కించుకొని వేగముగా నెక్కడికో తోలుకొనిపోయెను.

అంత మఱునా డుదయంబున దూరముగా బరుండియున్న పరిచారకు లచ్చటి