పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయుని కథ

221

యీ మందస మిందువైచిరి. ఇది చోరులపనికావచ్చును. దీనిలో నేమియున్నదో చూచెదంగాక యని మండుచున్న శ్మశానములోని కొఱవి నొక దానిం దీసికొని యా పెట్టెమూత విడదీసి చూడ నందొకసుందరి మూర్చ జెందియున్నది.

ఆయగ్ని వెలుంగున నాయంగన మొగముజూచి వెరగుపడుచు ఆహా! ఇట్టి కాంతను నిందు బారవైచిన కఠినాత్ముడెవ్వడో? ఈ సుందరికి బ్రాణము లింకను కంఠమునందున్నట్లు పొడగట్టుచున్నది. ఈ పెట్టెయందిమిడ్చి నొక్కుటచే బ్రతుకుట దుర్లభమని తోచుచున్నది. కానిమ్ము నాకుదోచిన చికిత్సఁ జేసి చూచెదనని మెల్లననందుండి యా సుందరిం బైకితీసి నిలువ బెట్టిన స్మృతిలేనిదగుటచే నిలువక నేలకొరగినది. అప్పుడతడు భుజముల నానుకొని సందిటంబట్టి యాచావడిలోనికి దీసుకొనిపోయి పరుండబెట్టి యుపచారము సేయుచుండెను.

ఎంతసేపటికిని నాయువతికి స్మృతి రామిఁజేసి తెల్ల వారుచుండ నికనిందుండ రాదని యయ్యండజయానను దనగుఱ్ఱముపై బరుండబెట్టి మెల్లననడిపించుచు నొక బ్రాహ్మణుని యింటికింజని పుణ్యాత్మా ! మేము విదేశస్థులము. ఇది నా భార్య రోగగ్రస్థురాలై యున్నది. రెండు దినంబు లిందుండి చికిత్స జేసికొనియెదను. కొంచెము తావిత్తురాయని యడిగిన నా యింటి యజమానుడు సమ్మతించి తన యింటిలో నొక మూలగది జూపెను.

అందులో నాసుందరిం బరుండబెట్టి యా రాజకుమారు డుపచారముల జేయుచుండ నాటి సాయంకాలమునకు నాయింతికి స్మృతివచ్చి కన్నులు తెరచి వెరచుచు హా! తల్లీ! ఇప్పటికి నీయుల్లము చల్లగానున్నదిగదా? దుష్టబుద్ధివైన నిన్ను నమ్మి నందులకు మంచి పనిచేసితివి. అని పలవరింపుచు మఱికొంతసేపటికి తెప్పరిల్లి నలుమూలలు చూచి యతని మొగము విమర్శింపుచు నిట్లనియె.

అనఘా! నీ వెవ్వడవు? ఈ గృహమెవ్వరిది? నేనిచ్చటికెట్లువచ్చితిని? చెప్పుమని యడిగిన నతండు యింతీ? అంతయుంజెప్పెద కాని నీ ముద్దుమో మెవ్వరికన్నులకు వెగటైనది? నీతళ్కు చూపులు జూచి యెవ్వడోర్వలేక బోయెను? నీ మృదుగాత్రంబులు గట్టి పెట్టెలో బెట్ట నెవ్వరికి జేతులాడెను. నిన్ను మూర్ఛముంచిన క్రూరుం డెవ్వడు? నేను వీరప్రతాపుని కుమారుండ. దేశాటనముసేయుచు నిన్నటిరాత్రి తెలియక నీవీటి స్మశానవాటికలో నివసించితిని. అర్థరాత్రమున నొకపెట్టెతో నెవ్వరో నిన్ను స్మశానవాటిలో బడవైచిరి. అది నేను చూచి నిన్ను జీవించియున్నట్లు నిశ్చయించి యిచ్చటికిం దీసికొని వచ్చితినని యా వృత్తాంతమంతయు జెప్పెను.

ఆ మాటలువిని యప్పాటలగంధి కన్ను లెత్తి చూచుచు ఆర్యా! నా వృత్తాంతం వినుము. నేనీ పట్టణపురాజు బలవర్థనుండను వానికూతురను నాపేరు హేమ. నాచిన్నతనమున మా తల్లి స్వర్గస్థురాలాయెను. మా తండ్రి వెండియు వినీతియనునాతిం బెండ్లి యాడెను. ఆమెకు సంతానము లేదు. దానంజేసి నాయం దీసుబూని యుండునది. నా తండ్రి నన్ను మిక్కిలి గారాబముగా బెంచుచు నాకు సకల విద్యలను నేర్పించెను.