పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

కాశీమజిలీకథలు - మూడవభాగము

వచ్చిన కన్యను వారే పెండ్లి చేసుకొందురుగాక. నాకీ శ్రమయేలనని తలంచి యప్పుడే కుమారుల నల్వుర రప్పించి యిట్లనియె.

వత్సలారా ! మీకు వివాహము చేయవలయునని యుత్తమ రాజపుత్రికల చిత్రపటంబుల నేరితెప్పించితిమి మీతల్లులు నొకతె కోరినదే తక్కిన మువ్వురు గోరుచు దేనికిం దృప్తిపొందిరిగారు వారిని సమాధానపఱుప బ్రహ్మవశముకాదు. ఇదివరకు మీకు నలువురకు సమానముగా వస్తువాహనాదు లేర్పరచితిని. స్త్రీలలో నించుకభేదము లేక యొక్క పోలికగా నుందురా? కావున మీ వివాహములు నేను చేయజాలను. మీకు కావలసినంత ద్రవ్యమిచ్చెద మీరు దేశాటనము చేసికొని మీ యిష్టమువచ్చిన కాంతను బెండ్లియాడిరండు. పొండని పలికెను.

ఆ మాటలకు నారాజపుత్రులు సంతసించుచు తండ్రియాజ్ఞ ననుసరించి తల్లులకు చెప్పి పెక్కుద్రవ్యము సంగ్రహించుకొని శుభముహూర్తంబున దేశాటనమునకు వెడలిరి వారు వెడలునపుడు సంవత్సరమున కొకసారి కలిసికొని మాటలాడుటకు దగిన నెలవుల నిరూపణము జేసికొనిరి.

విజయుని కథ

అందు శుభముహూర్తంబున విజయుడు ఇల్లుతరలి, తురగారూఢుడై ప్రధానాయుధంబుల ధరించి తూరుపుముఖముగా బోవుచు బదిదినంబుల కనేకదేశములు కడచి యొకనాడు సాయంకాలమున కొకపట్టణమునకు బోయెను.

అప్పటికి జీకటిపడినది గ్రామములో నెచ్చటికి బోవలయునో తెలియక తన కప్పటి కొకచోట గనంబడిన చావడిలోదిగి గుర్రమును గట్టివైచి యా రాత్రియందు వేగింపదలంచి నేల శుభ్రపరచుకొని కూర్చుండెను. డామూల జాడవెలుతురు గనంబడుటయు నందు మనుష్యులుందురను ధైర్యముతో నెద్దియో యడుగుటకై యచటికిం బోయెను ఆ వెలుతురొక శ్మశానమై యున్నది సగము దగ్ధమైన శవముతో వెలుగుచున్నది. అందెవ్వరునులేరు. అతండు వెఱువక యాలాటి కాటిమంటలు రెండుమూడుచూచి యోహో! ఇది శ్మశానభూమి. తెలియక నిందు నివసించితిని. ఈచావిడి యిందు ప్రేతకర్మల నిమిత్తము గట్టియుండబోలు. కానిమ్ము దీనికి వెఱువ నేల అని ధైర్యమే తనకు సహాయముగానుండ నాచావడిలో గూర్చుండి నిద్రబోక ప్రొద్దుపొడుపున కెదురు చూచుచుండెను.

అట్టు కొంతసేపుండ నొకమూల గుభేలుమని చప్పుడైనది. ఆధ్వని విని యతం డదరిపడుచు నాదెసం బరికింప నొకమందస మందు బడియున్నది. దానింజూచి యతడు లేచి దాపునకుంబోయి యోహో! ఇది కోటగోడలాగున్నది. దీనిలోమండ