పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరప్రతాపుని కథ

219

వని యాక్షేపించుచు గానిమ్ము పద్మగంధిని పద్మిని కుమారునికిని మత్స్యగంధిని కమిలినీ కుమారునకును బెండ్లి చేయుటకు నిశ్చయించి పద్మిని తానెట్లు చెప్పిన నట్లు వినునదికావున నప్పటి కప్పడతియొద్దకు బోక మూడవభార్య యొద్దకు బోయి యామెకా చిత్రపటంబులజూపి యీమూటిలో నేబోటి నీకుమారున కనుకూలించునో చెప్పుమని యడిగెను. అంతకుపూర్వమే యంతఃపురచారిణుల వలన వెనుకటి సంవాద మంతయు తెలిసికొనియున్న కతంబున కుముదిని చురచురం జూచుచు నిట్లనియె.

ఇప్పుడు నాకుమారునకు వివాహమవసరములేదు. బ్రతికియుండిన బెండ్లి కాకయుండునాయేమి? మీ ప్రియపుత్రులకుం జేసికొనుడు దీని నాకు జూపనవసరం లేదని త్రోసివేసినది. ఆప్పుడతడయ్యో! నిదేమి పాపము కారణములేకయే కోపింతు వేల. నీకుమారున కేమిలోపము చేసితినని యిట్లంటివని పలికిన నచ్చెలువ అగునగు లోపము చూపవలయునా? దేశములనుండి నాలుగు చిత్రఫలకములు వచ్చియుండ మంచిది, యిచ్చవచ్చిన మచ్చకంటి కిచ్చి తక్కినవి చూపుట లోపముకాదు కాబోలును. దానిందెచ్చి చూపిన సంతసింతుముగదా? అని పలికినది.

అప్పుడారాజు దేవీ! అది వీనికన్న మంచిదికాదు. ఒకరుకోరినం దానినిం గోరిన నేమి చేయుదును? అందఱు నొక్కదానినే కోరిననెట్లు? ఈ నలుగురు కన్యకలు ఇంచుకభేదము లేనివారని వినియుంటి కావున నీకొక రహస్యము చెప్పెద. వీరిలో పుష్పగంధి మిక్కిలి తెలివిగలదట. దాని నీకుమారునకుం జేసికొనుము. నామాట వినుమని బ్రతిమాలుకొనెను. ఎంతజెస్పినను నాకాంత యామువ్వురిలో నొక్క దానిని సమ్మతింపక మత్స్యగంధినే కోరుకొనెను. అప్పుడతండు విసిగికొనుచు నాలుగవభార్య యొద్దకు బోయి యాపటముల మూడింటినిజూపి మునువోలె నడిగిన నప్పడంతియును లోపలివార్తల దెలిసికొనియున్నది కావున మత్స్యగంధినే కోరుకొనియెను.

అప్పుడారాజు వీరందరికన్న బుష్పగంధి నెక్కుడు విద్యావతియు రూపవతియునని నమ్మిక పుట్టునట్లుచెప్పి పుష్పగంధించేసికొనుటకు మాలిని నొప్పించెను. ఆ రహస్యము వారెట్లో తెలిసికొని వెండియు నడుగుటలో పుష్పగంధియే కావలయునని కోరిరి. మఱియొకమారు అందరు కమలగంధి కావలయునని కోరిరి. ఒక్క మాటయు స్థిరముగా జెప్పక యెవరు కోరినదానినే తక్కినవారు కోరుచు తుదకా నృపోత్తముని చిత్తము వ్యసనాయత్తము గావించిరి.

అట్లు కొన్నిదినంబు లారాజు వారితో బ్రసంగించి యెవ్వరి మనస్సును దృప్తిపరుపలేక విసిగి యొకనా డాత్మగతంబున నిట్లు తలంచెను. సీ! స్త్రీహృదయము కన్న వక్రమైనది మఱియొకటి లేదుగదా? ఎట్టిపనినైన జేయవచ్చునుగాని స్త్రీ చిత్తము చక్కపఱుపజాలము. బ్రహ్మసృష్టిలో హెచ్చుతగ్గులు లేకుండునా? వీ రేమియుం దెలిసికొన సాపత్నీమాత్సర్యమునం జేసి నన్ను వేపుచున్నవారు. ఇక నాదక్షిణనాయకత్వము నిలువదు. వీరిని నేను సమాధానపఱుపలేను. ఎవరియిష్టము