పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

కాశీమజిలీకథలు - మూడవభాగము

లేదు. ఇష్టముండిన నా పద్మగంధినే నా కుమారునికి బెండ్లి చేయుడు. లేకున్నమానివేయుడని చెప్పినది.

అప్పుడా రాజు కాంతా! నీవేమియు నెఱుంగవు? పద్మగంధికంటె వీరు తక్కువవారుకారు. నామాటవిని వీరిలో నొకపాటలగంధి గోరుకొమ్మని పెక్కుగతుల బ్రతిమాలుకొనెను. గాని యానాతి సమ్మతించినది కాదు. అప్పుడతండు కానిమ్ము పద్మిని దీనికంటె గుణవంతురాలు. దానినెట్లో సమాధాన పఱుపవచ్చునని యాత్మగతంబున నిశ్చయించి యువతీ! నీ కుమారునకు బద్మగంధి నిచ్చిన సంతసింతువుగదా యనుటయు, నామె సమ్మతింతునని యుత్తరమిచ్చినది.

ఆమాటవిని రాజు వెండియు బెద్దభార్యయొద్దకు బోయి సానునయముగా నిట్లనియె. ప్రేయసీ! ఇటుచూడుము. ఇమ్మత్స్యగంధి విద్యలలో నసమానురాలట. నీవు కోరుకొనిన పద్మగంధికి విద్యాగంధమంతయులేదని నాకు రహస్యముగా దెలిసినది. రూపముగూడ సామాన్యమేనట. రంగులచే నట్లు మెరయజేసిరి. ఈరహస్యము నాకొక గూఢచారునివలన దెలిసినది. కావున నీకుమారున కదితగదు ఈ మత్స్యగంధిని బెండ్లి చేసికొనుము. నీయందుగల మక్కువచే నింత చెప్పితినని పలికిన విని యక్కలికి నాథా! మీరు చెప్పినది యథార్థమే. కపటముకాదుగదా? నాకుమారుడు మీకుమారుడు కాడా? ఎవ్వతెయైన నొకటెయని మత్స్యగంధి ప్రతికృతిం గైకొని పద్మగంధి చిత్రఫలక మతినికిచ్చినది.

దానింగైకొని యారాజు రెండవభార్యవద్దకు బోయి, ముదితా! ఇదిగో నీవు కోరిన మదవతి చత్రపటము దీసికొనివచ్చితిని గైకొనుమని పలికెను. పెద్ద భార్య యొద్ద జరిగిన సంవాదము గూఢచారిణికతన వినియున్న కతంబున మొగము ముడుచుకొని యాపడతి చాలు చాలు నీ ప్రేమానుబంధము తెలిసినది. చెప్పినమాటలన్నియు నిజములే యనుకొనుదానను విద్యలేని పశువును గురూపిణి బెండ్లియాడి నాకుమారుడానక బరితపింపనేల? నాకుమారుడు బ్రహ్మచారిగానే యుండును. మంచికన్యకల నీప్రియకుమారులకు బెండ్లిచేసికొనుడని పలికి తలవాల్చుకొని కన్నీరు విడువంజొచ్చినది అప్పుడు స్త్రీ హృదయముకన్న క్రూరమైనది వేఱొకటి లేదుకదా? యని నిశ్చయించుకొని అతివా? నేనేమి లోపము చేసితిని. నీవు కోరిన చిన్నదానినే తీసుకొనివచ్చితిని. ఇప్పుడు నన్నూరక నిందించుచున్న దానవు. నీయభిప్రాయమేమి ? నీవెట్లు చెప్పిన నట్లు నడచువాడను నీయభిలాష మెఱింగింపుమనిన నత్తన్వి ఏమో? మీమాటలు నిజమని పద్మగంధిని గోరితిని. కపటముచే యనిపించిరని యెవ్వరికి దెలియును? పోనిండు మత్స్యగంధినే నాకుమారునకిండు అనిపలికిన విని యారాజు బోటీ! ఈమాటయైన నిక్కువమేనా? చెప్పుమనుటయు నానాతి యిందు మఱేమియునుం గపటము లేదుగదా? మీమాటలెవ్వరు నమ్ముదురు? అని పలికినది.

నిన్ను మోసపుచ్చి నీకుమారున కొకవెర్రిదాన్ని గట్టిపెట్టవలెనని నాకున్నది. వాడు నీకేగాని నాకు గుమారుడు కాడుకాబోలు. చాలులే ? స్త్రీ చాపల్యంబునం బలికెద