పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(27)

వీరప్రతాపుని కథ

217

సమభావముగా జూచుచు గొన్నిదినంబులు గడిపి సంతానవిహీనచింతచే గృశించుచుండ నొకనాడు మంత్రసిద్ధుడను యోగివచ్చి యతనిచేత నర్చితుండై యందు గొన్నిదినంబులుండెను. ఆ సిద్దుడతని విచారకారణంబు దెలిసికొని దయవచ్చి యా రాజుచే నొకహోమము గావింపజేసి హోమావశిష్టమగు చెరువు భార్యల కిమ్మని చెప్పెను. ఆ సిద్ధుని మంత్రసిద్దివలన నా పాయసము భక్షించిన కొలది కాలములోనే గర్భవతులై యా రాజుభార్యలు నలువురు పదియవమాసంబున నొక్క దిసముననే పుత్రులు గనిరి.

అప్పుడా రాజు పాఱుల కపారముగా షోడశమహాదానములం గావించి జాతకర్మాదివిధుల నిర్వర్తించి విజయభాను రామచంద్రులని నలువురకు సమముగా నేకనామమే యుంచి సంజ్ఞాగ్రహణార్ధమై విజయుడు, భానుడు, రాముడు, చంద్రుడు అని యంతర్నామములు వచ్చునట్లు నామకరణము చేసెను.

అబ్బాలురు పలువురు శుక్ల పక్షశర్వరీపాలునివలే దినదినాభివృద్ధి బడయుచుండిరి. కుమారులు నలుగురికి నించుకేని సంతరము లేకుండిన సమమైన యలంకారములం బెట్టించి వారికల్లు లొండొరులు కలహింపకుండునట్లు చూచుచుండెను. విద్యాభ్యాసకాలమున వారికి వేఱువేఱు విద్యామందిరములం గట్టించి వారి తల్లులచే ననుమోదింపబడిన యుపాధ్యాయులచే విద్య గరపింపజేసెను.

ఆ రాజకుమారులు సమరూఢయౌవనులై విద్యాప్రభావంబున నధికులైరని ఉపాధ్యాయుల వలనం దెలిసికొని యా రాజువారికి వివాహములు సేయ నిశ్చయించి యుత్తమరాజకన్యల చిత్రపటంబులందేర నలుమూలలకు దూతలం బంపెను. వారు పోయి దేశములన్నియుం దిరిగి వారు చూచినవారిలో రూపయౌపనసంపన్నుల నుత్తమరాజకన్యకల చిత్రపటంబులు నాలుగు తీసికొనివచ్చిరి. యాఱేనికి జూపిరి.

తదీయ కులశీలనామంబులు విమర్శించి యా రాజు తన కుమారుల కనుకూలు లగు భార్యలు లభించిరని మిగుల సంతసించుచు వారి చిత్రపటములం గైకొని పెద్దభార్య యొద్దకుంబోయి యిట్లనియె.

బోటీ! ఈ పాటలగంధులు నలుగురు రూపయౌవనవిద్యాసంపన్నులు. సత్కుల ప్రసూతలు అని వారివారి చరిత్రలు వేఱువేఱు చెప్పి వీరిలో నీకుమారున కెవ్వతెం జేసికొందువని యడిగెను. అప్పు డప్పద్మిని పెక్కుగతుల నాలోచించి పద్మగంధినిం గోరుకొనెను. ఆ రాజపుత్రి చిత్రఫలక మా పద్మినికిచ్చి తరువాత నారాజు రెండవభార్య కమలిని యొద్దకుంబోయి యా చిత్రఫలకముల వృత్తాంతము చెప్పి ఈ మువ్వురిలో నీ కుమారున కెవ్వతెం గోరుకొనెదవని యడిగెను. అప్పు డమ్మగువ వానిని విమర్శించి నాలుగవది యేదియని యడిగెను అది పద్మిని కుమారునకు నిశ్చయించి యామె కిచ్చితినని యతండు చెప్పెను బాగుబాగు మంచి రాజపుత్రిక నిష్టముగలభార్య కొడుకునకు బెండ్లిచేయ నిశ్చయించి యీ కొరమాలిన కన్యలం జూపించి యెవతెకావలయునని యడుగుచుంటిరా? వీరి మువ్వురిలో నొక్కతెయు నాకక్కర