పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(26)

కల్పవల్లి కథ

209

గారింకను నచ్చటనేయున్నవారు. సుప్రభ ఏమివార్త వినినదో కన్నీరు నించుచున్నది. పెనిమిటి ఓదార్చుచున్నవాడు. విదేశవార్తలేమయిన దెలిసినవేమో మనము వచ్చినవేళ మంచిదే. మనకార్యము చెప్పుకొనుటకే సమయమయినదికాదు. ఇప్పు డెట్లు చెప్పుదుము. తొందరపడిన గార్యము చెడునుగదా యని వితర్కింపుచు మంత్రిగా రచ్చటనుండి వెళ్ళినతర్వాత మంగమణితోడ వెండియు సుప్రభయొద్దకు బోయినది.

అప్పుడు సుప్రభ తలవాల్చుకొని యెద్దియో ధ్యానింపుచుండ మంగమణి దాపునకుబోయి అమ్మా! ఇట్లు ఖిన్నురాలవయి యుంటివేమి? విదేశవార్త లేమయిన దెలియవచ్చెనా? యని యడిగిన నప్పడతి మెల్లన తలయెత్తి యిట్లనియెను.

బిడ్డలారా? ఇదివర కడుగంటియున్న నా దుఃఖము నీ నాగమణి వచ్చి బైట పెట్టినది. ఇందాక మీతో గంగలో బడినదని చెప్పిన నాగమణి యిదియె. గంగలో బడి కొట్టుకొనిపోయి యెక్కడనో గట్టెక్కి, సుఖదుఃఖము లనుభవించి వచ్చెనదట. నా పసికూనయు జీవించియున్నదని చెప్పుచున్నది. అని నాగమణి చెప్పిన వృత్తాంత మంతయు సుప్రభ మంగమణికి జెప్పినది.

ఆ కథ విని మంగమణి ప్రియంవద మొగము జూచుచు నామె మాటకేమియు నుత్తరమీయక చయ్యన నాప్రియంవదతో గూడ నవ్వలికింబోయి నివ్వెరపడుచు సఖీ! మన చరిత్రము లిట్లున్నవేమి ? ఇది కల్పితము కాదుగదా? కాదు నిక్కువమే? అన్నా! మనము క్షత్రియకన్యలమని తెలిసికొనక వారకాంతల మనుకొని కులమున కపఖ్యాతిదెచ్చితిని. అయ్యో! వీరు నా తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు కలిఘాతాపురిలో నుండిరట. మనల గురించి యీ నాగమణి యెన్ని యిడుమలం బడినదో చూచితివా! దాని ఋణ మెన్నటికిం దీర్చుకొనలేము ఇప్పుడు మన వృత్తాంతములను గురించి వీరేమి చెప్పుకొనియెదరో యరసి పిమ్మట మనలం జెప్పుదుముగాక? అయ్యారే! దైవసంఘటన మెంత చిత్రమయినది. మనము గావించిన కృత్యములలో నెందేని దూష్యకృత్యమున్నదేమో యరయుము. నాకేమియు జ్ఞాపకములేదు. అని వారు మాటలాడుకొనుచున్న సమయమున నచ్చటికి సుప్రభ వచ్చి బోటు లారా! అచ్చోటనుండక వచ్చితిరేమి? నాపుత్రిక చారిత్ర మశ్రావ్యముగా నున్నది కాబోలు. నేమిచేయుదును? అది యట్లుండనిమ్ము. మీరువచ్చిన కార్య మెద్దియో యెఱింగింపుడు. నాలుగుదినములనుండియు వినుటకే యవకాశము కుదిరినదికాదు. నేను జేయవలసిన పనియేమి? ఎట్టికార్యమయినను నా ప్రియునిం బ్రార్థించి చేయించెదనని యడిగిన విని మంగమణి యించుక నవ్వుచు నిట్లనియె.

తల్లీ ! నీ పుత్రిక మందారవల్లిని బ్రియంవదను నే నెఱుంగుదును. వారి చరిత్రలను వినియే యాశ్చర్యమును బొందుచున్నారము. వారును మేమును గొంత కాలము కలిసి దేశాటనము జేసితిమి. పెక్కులేల? వారే మేముగా సంచరించితిమి. తెలియమిచే వేశ్యలమని చెప్పుకొనిరి. గాని వారిని దృఢవ్రతశీలలని చెప్పవలయును.