పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగమణికథ

181

కుండునంద్రు. మనుష్యాంగనలలో నట్టి సుందరిం జూచియెఱుంగనని యనేకప్రకారముల పొగడుచు మెచ్చుకొనుచు దలయూచుచు అపూర్వసంతోషముతో మనోహరనూత్నాంబరాలంకారముల చేగొన చేసినది.

పిమ్మట బ్రియంవదకును నభ్యంగనవిధి నిర్వర్తింపజేసి తరుణీ యీనాతి నీ కేమి కావలయు? వాల్లభ్యం బనుకూలముగా నున్నదియా సంతతి యేమాత్రమని ఆడిగిన బ్రియంవద పక్కున నవ్వినది.

అప్పుడు మంగమణి సుశీలతో దేవీ! ఈవెలది సంతతి గురించి అడిగినందులకు నవ్వినది. బాల్యచేష్ట లింకను విడువలేదు. మఱియొకలాగున తలంపకుమా? మాకు సంతతిలేదు. వాల్లభ్యంబునకు యువతుల నడతలేకదా కారణములు. అట్టి కొరంతయేమియును లేదు. నాకిది పినతల్లికూతురు మా భర్తలకు యట్టిబాంధవ్యమే కలిగియున్నదని యామెకు సమాధానము చెప్పినది.

ఇంతలో బూజాగృహంబున గంట వాయించుటయు సుశీల యదరిపడి స్నానగృహంబునకుబోయి జలకమాడి దేవీపూజగావించి అర్చాభవనమునకు వచ్చినది.

అంతకుమున్ను పరిచారకులు మంగమణిని బ్రియంవదను బూజామంటపములో బైడిపీటలపయిన గూర్చుండియున్న రామలింగకవి ప్రక్కను సుభద్రుని ప్రక్కను యథానుమతముగా గూర్చుండబెట్టిరి. అప్పుడు రాజపత్ని భర్తతో వచ్చి యా దంపతులకు బ్రత్యేకము షోడశోపచారపూజలం గావించి పార్వతీపరమేశ్వరులనియు లక్ష్మీనారాయణులనియు భావించి అనేక దానములం గావించి బ్రాహ్వణాశీర్వాదములనంది యానందముతో బిమ్మట అందఱును మధురాహారములచే సంతృప్తుల గావించినది.

భోజనానంతరమున నేకాంతనిశాంతముననున్న సమయంబున బ్రియంవద మంగమణితో సఖీ! ఇందాక రామకవి మనతో బీటలపై గూర్చుండుటేతడవు పిమ్మట బోవచ్చునని చెప్పెనే యీ గొడవలన్నియు నేమిటియవి. అయ్యో! ఆశీర్వాదములు బ్రహ్మముడులు సేసలు జల్లుట దలంచుకొన వింతయగుచున్నది. ఈబ్రహ్మముడులు బ్రహ్మముడులు కావుగదా! చక్రవర్తులకైన లక్ష్యముచేయని నీ వీతనిపజ్జ గూర్చుంటివి. ఏమి కాలమహిమయని పలికిన విని మంగమణి నిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె.

చెలీ! నీవు దానికే వింతపడుచుంటివి ముందరికథ యెఱుంగవు భోజనముచేసి వచ్చునప్పుడు నాతో సుశీల యాడుబిడ్డ చెప్పినది. ఈ రాత్రి మనకు శోభనము చేయించునట. అంతఃపురములు చక్కగా నలంకరించుమని పరిచారికలతో జెప్పుచున్నది. ఆమె వ్రతమట్టిది కాబోలు. నీలాటి కల్పితము లామె కేమి తెలియును. మనల జూసినది మొదలు మఱియు మురియుచున్నది. మన మిప్పు డేమి చేయవలయును