పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

కాశీమజిలీకథలు - మూడవభాగము

నై నను బరోపకృతి జేయవలయునని ఉన్నది. అందు బ్రాహ్మణులు, విద్వాంసులును, మనకు పరమమిత్రులు. అట్టివారి విషయమై యేమిజేసినను నింద్యముకాదు, మన మగవారు వినినను నెగ్గుపట్టరు. అన్నింటికిని మనస్సు ప్రధానము. మనము వారియొద్ద నిచ్చట గూర్చుండలేదా? అట్లే అచ్చటను గూర్చుందము. నీ వెవ్వరిదాపున గూర్చుందువు అయ్యో! నవ్వెదవేల? మన బ్రాహ్మణులే కారటే నీమగడు శంకించిన నేను సమాధానము చెప్పెదనులే? అని పలుకుచు నార్యా! మీ కార్యము మీరు చూచుకొనుడు. మమ్ము మీప్రక్కలం గూర్చుండి దానమందవలయుననియే కదా మీ యభిప్రాయము. మీ లాభము బోగొట్టనేల. అలాగుననే కూర్చుండెదము. వేగముగా బంపవలయు నెవ్వరేని యెఱింగినవా రుండిన మోసము వచ్చుజుడీ యని పలికిన సంతసించుచు నా రామలింగకవి యిట్లనియె.

చానా! నేనామాట మొదటనే చెప్పితిని. మనము పోవుటయే తడవు పీటలు వైచి కూర్చుండబెట్టి ధారవోయుదురట. ఈ మాట చెప్పుటకు వెరచుచున్నవాడ. నిట్టిసాహసము చేయుటకు నీకే తగును. నీయౌదార్యము గొనియాడుటకు వేయినోళ్ళు కావలయునని స్తోత్రములు సేయుచుండ వారించుచు మంగమణి వేఱొక ప్రస్తావము దెచ్చినది. పిమ్మట నాకొమ్మలిరువురు నావిషయమే చెప్పుకొనుచు నవ్వులాటలమాటలతో నాదివసమును గడిపిరి.

మఱునాడు సూర్యుండు పూర్వగిరిశిఖర మలంకరించినతోడనే రాజపత్ని వారిం దోటితేర అశ్వశకటముల నంపినది అమ్ముద్దియులిద్దరు బ్రాహ్మణాంగనల పోలిక మెరయ భూషాంబరములు దాల్చి మేలిముసుగుతో జెరియొకరి పజ్జనుం గూర్చుండిరి అంతకుమున్ను చనువుగా మాట్లాడు నాచేడియలకు బత్నీభావంబు వహించుటచే నపూర్వలజ్జావిభ్రమంబులు మనంబున నంకురించినవి.

ఆశకటంబులు తృటిలో వారి నంతఃపురము జేర్చుటయు బండ్లుదిగి యందు బరిచారికులచే జూపబడిన గదులలో వారు నివసించిరి. ఇంతలో వాడుకప్రకారము ముత్తెదవలువచ్చి యభ్యంగనము చేయుడని వారి బలవంతముపెట్టిన సమ్మతించిరి కారు. ఆ మాట విని సుశీల స్వయముగావచ్చి వారింజూచి తదీయ రూపలావణ్యాదివిశేషముల కచ్చెరువందుచు నట్లె నిలువంబడి చూచుచుండెను.

స్వభావసుందరులకు వికృతియు శోభం దెచ్చునుగదా మసిపాతగట్టినను మాణిక్యము మెఱయకుండునా? మేలిముసుగు వైచుకొని యున్నను వారు చూచువారికి వింతలు గలుగజేయుచుండిరి.

అప్పుడా సుశీల మంగమణి వలదువలదనుచుండ బలాత్కారముగా దానే తలయంటి పన్నీట జలకమార్చినది. తదంగలావణ్య మరసి యరసి సుశీల విస్మయము బొందుచు నాహా! ఇట్టి మోహనాంగిని సార్వభౌమునికి భార్యజేయక యొక నిరుపేదకు గట్టిపెట్టిన మరమేష్టి నెంతదిట్టినను దోషములేదుగదా. ఔరా! ఈ యొయ్యారము, ఈ లావణ్యము, ఈసోయగము, ఈ జవ్వనము, ఈబింకము, దేవతాకాంతల