పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

కాశీమజిలీకథలు - మూడవభాగము

మొగమాటమునకు బోవ నెద్దియోయైనదట. సహవాసబరిచయంబునకు గలిగిన ఫలమిది. నీవనిన ట్లీముడులు బ్రహ్మముడులే కాబోలు? నిరుపేద పాఱుల కుపకృతి యగునని తలంచినందులకు సుకృతము ఫలించినది యెల్లరుచూడ వారిపజ్జల గూర్చుండి యాశీర్వాదములంది యిప్పుడు మేమట్టివారము కామనిన నెవ్వరు సమ్మతింతురు నిజము చెప్పితిమేని దండ్యుల మగుదుము. పాపపువిధి యెట్లు విధించెనో యట్లు జరుగకమానదు. చింతించుట నిష్ప్రయోజనమని పలికిన విని ప్రియంవద అదిరిపడి భళాభళ మిక్కిలి చక్కగానున్న దే? రామకవి యెఱింగియే మనలను మోసముచేసెను. చాలు నీబాపనసాంగత్యము యేమయినను సరియే మనము పోవుదము రమ్ము శిక్షించిన ముందువారినే శిక్షింతురని బలుకుచున్న సమయంబున రామలింగకవి యెద్దియో పనికల్పించుకొని యచ్చటికి వచ్చెను.

ఆతని జూచి ప్రియంవద కన్నులెర్రజేయుచు రామకవీ! మమ్ము జక్కగా వంచించితివే. మొదట నీ పేరిట దానిచేతనే వంచింపబడితిమి. నీవంతకన్న మోసగాడవైతివి నిజముచెప్పి నిన్ను దండింపజేయుదుము జూడుమనియు నతండు వెరచుచున్న ట్లభినయించుచు కాంతలారా! మొదట నీగొడవేమియు నేనెరుంగను దానము లందుకొనుటగదాయని మిమ్ము బ్రార్థించితిని. ఇట్టిదవి తెలిసినచో గోరకయేపోదును మిమ్ముజూడ నాకును సిగ్గగుచున్నది. ఏ త్రోవయు గానరాదు. ఏమి చేయుదును? ఇప్పుడువచ్చిన ద్రవ్యమంతయు వదులుకొనియెదను యేదియేని యుపాయముండిన జెప్పుడు మర్యాద నిలిచెనేని ధనము మఱియొకరీతిని సంపాదించుకొనవచ్చును. మీవంటి సతీమణుల క్లేశపరచుట యుచితమా? అని వినయముతో బలుకుచున్న ఆతనికి మంగమణి యిట్లనియె.

ఆర్యా! రాజపత్ని యుత్సాహము వారింప బ్రహ్మతరముగాదు. యిప్పుడు వేరొకయుపాయ మేమియును లేదు. రోటిలో తలపెట్టి రోకటిపోటునకు వెరచిన బ్రయోజనమేమియున్నది. మొదటనే యాలోచించుకొనవలసినది యిప్పుడొండు వినుడు బంధమోక్షమునకు గారణము మనస్సుకదా, అట్టిమనస్సు దృఢపరచుకొని యున్నయెడల నేప్రమాదము గలుగనేరదు. విద్వాంసులైన మీకు నేనింతకన్న జెప్పనవసరములేదు. "బలవానింద్రియగ్రామోవిద్యాంసమపికర్షతి" అనియున్న యార్యోక్తిమరువవద్దని పలికినవిని యతండు నమ్రతతో నింతీ! నీవు నాకింతఁ జెప్పవలయునా? సందియమందకుము మీడెంద మెట్లుండె నట్లె వర్తింతుమని పలుకుచున్న సమయంబున నచ్చటికి సుశీల వచ్చుచున్నదని యొక దాదివచ్చి చెప్పినది.

ఆమాటవిని రామలింగకవి తన నెలవునకుం బోయెను సుశీల వచ్చినవారితో గొంతసేపు ముచ్చటించుచు ననర్ఘరత్నమండనములచే నలంకరింపజేసి శయ్యాగృహంబులకు దీసికొనిపోయినది.