పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కాశీమజిలీకథలు - మూడవభాగము

పోయినను బోవచ్చునని చెప్పితివి కదా యిపుడు పోవచ్చునా? యిచ్చట మనము చేయవలసిన పని యేమి యున్నది? నన్నొకసారి మరల నచ్చటికి దీసికొనిపోవా? యని అడిగిన సుమిత్రుండు రాజపుత్రా! యిది సమయము కాదు.. అచ్చటికి సాయంకాలమే పోవలయునని చెప్పి యేట్టకే వాని నంతదనుక బోకుండ నిలిపెను. జయభద్రునికా కాలవ్యవధిగడియ యుగముగా దోచినది. సారెసారెకు బ్రొద్దు చూచుచు సమయమైనది లెమ్మని సుమిత్రుని దొందరపెట్ట జొచ్చెను.

అంత యథాప్రకారము సాయంకాలమున బయలువెడలి సుమిత్రుడు రాజపుత్రు నుద్వాసగమనకైతవంబున నయ్యంగచంద్రిక యింటికి రహస్యముగా దీసికొనిపోయెను. అదియు వారి కెదురువచ్చి తోడ్కొనిపోయి తల్పంబునం గూర్చుండబెట్టినది, అప్పుడు సుమిత్రు డెద్దియో కల్పించుకొని యిప్పుడే వత్తునని చెప్పి యుద్యానవనమునకు బోయెను.

అప్పుడా రాజకుమారుం డంతరంగంబున లజ్జాసంభ్రమకౌతుకంబు లొక్కసారి జనియింప నేమి చేయవలయునో తెలియమి నలుమూలలు సూచుచు సుమిత్రా! సుమిత్రా! యని పిలచెను. అప్పు డప్పడంతియు దాపునకుబోయి దాసురా లిందుండ సుమిత్రుని జేరెద రేల ఆయన ఇప్పుడే వచ్చెదనని చెప్పి యేగుట మీరెఱుగరా? పనులేమి? చెప్పుడు? మాకు మీ సేవకన్న వేఱొక కృత్యమేమియున్నదని పలుకుచు నతండు వలదు వలదనుచుండ బలాత్కారముగా హస్తములంగైకొని మేనెల్ల మలయజం బలందినది. సిగం బూవులు ముడిచినది కంఠంబున బుష్పమాలిక లర్పించినది. వీణ పాణింబూని అత్యంత మోహజనకంబులగు రాగంబులు వెలయ దంత్రీనాదంబుతో బికస్వర వికస్వరంబగు కంఠస్వరము మేళవించి హాయిగా బాడినది.

అప్పు డంతడాసుపాణి పాణిగ్రహణముగావించి కేళీలాలసుండగుటయు నారోపితశరాననుండైన కుశుమశరుం డేతత్కృత్యంబుల నెల్ల నతని కువదేశించెను.

అత్తరుణియు నతని యిచ్చవచ్చిన తెఱంగున వేడుక గలుగజేసినది. అట్లు వారిరువురు సుఖపారావారవీచికలం దేలియాడుచున్న సమయంబున సుమిత్రుండు వచ్చి జయభద్రుం జీరి యిప్పుడు చీకటిపడినదనియు నింటికిబోవలయు రమ్మని పిలిచెను. కాని రాజపుత్రుం డుదయమువఱకు దన్నచ్చట నుండనిమ్మని సుమిత్రుని మిక్కిలి వేడుకొనియెను. అతం డియ్యకొని అప్పటి కింటికిబోయి జయభద్రుని విషయమై యుపాధ్యాయునితో నెద్దియోచెప్పి యారాత్రి గడపి యుదయంబున మరలబోయి జయభద్రుం జీరెను.

అప్పుడు రాజకుమారుండు అయ్యో! మిత్రమా! రేపు ప్రొద్దున రమ్మని చెప్పిన అప్పుడే వచ్చితివేమి? నేను సుఖించుట నీకిష్టము లేదా? నీవు చేసిన యుపకార మెన్నటికిని మఱువను. ఇప్పటికిబోయి రేపు రమ్మని బ్రతిమాంగా వినినవ్వుచు సుమిత్రుడు, భర్తృదారకా? ఇప్పుడు సూర్యోదయమై రెండుగడియలైనది. చూడుము