పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయభద్రునికథ

15

సుమిత్రుం డతివా! మేము వచ్చి తడవైనది పోవలయు. మే మొరు లెరుగకుండ నిచ్చటికి వచ్చితిమి ఱేనికిం దెలిసిన బ్రమాదము నీయాదరము పునరాగమనమునకు బ్రోత్సాహము జేయుచున్నది. నీనేస్తము మరువదగినది కాదని పలుకుచు బోవుదము లెమ్మని యతనిఁజీరి హ స్తమును గైకొనియెను.

అప్పు డప్పుడతి మొగంబున విన్నదనంబుదోప అయ్యో! యిప్పుడే పోయెదరా! ఈ మనోహరుని యాకృతిజూడ జూడదనివి తీరకున్నది. అదృష్టవశంబునం గాక యీ రాజకుమారుని దర్శనంబు దొరకునా! దాసురాలిం గరుణించి యెట్లయిన నీరాత్రి నిందుండం బ్రార్ధించుచున్న దాననని యెన్నియో చెప్పినది. కాని సమ్మతింపక సుమిత్రుం డయ్యంగనతో వెండియు రేపు వత్తుమని చెప్పి జయభద్రుని బలాత్కారముగా నందుండి లాగికొనిపోయెను.

అతి ప్రయత్నమున సుమిత్రుని వెంటనడుచుచు రాజకుమారుండు మిత్రమా! ఇప్పుడు మనల సత్కరించిన జవ్వని యెవ్వతియ? ఇంతకు మున్నట్టి యాకృతి గల కలకంఠిం జూచి యెరుంగనుసుమీ? ఈ వీథి కిదివరకు నీవు వచ్చితివా! మన పట్టణములో నిదియే ప్రధానపువీథియని తలంచెదను. ఇందున్న వారందరు వింతరూపులనొప్పియున్న వారు. ఆ పూవుబోడియు నీవు నెద్దియో మాటలాడిరి. నా కందున్నప్పుడు మేను వివశమైనదేమి? దానంజేసి మీమాటలు బోధపడినవికావు. మనము మరల అచ్చటికి బోవచ్చునా యని పలుమారడిగిన మాటయే అడుగుచు చెప్పినమాటయే చెప్పుచుండవిని సుమిత్రుండు నవ్వుచు నిట్లనియె.

వయస్యా! ఇప్పుడు మనల నాదరించిన పైదలి వారకాంత, వారస్త్రీ గణికా వేశ్యా అని మన మమరములో జదివిన పర్యాయపదములన్నియు దానికివర్తించును. ఆ వాల్గంటి యింటికి నెప్పుడుపోయినను బోవచ్చును. అది వెలయాలగుట నాటంకముచేయువారు లేరు. యిప్పుడు నీ హృదయంబులో నయ్యంగనఁ జూచుటచే శృంగారరసం బంకురించినది. గురు డెరింగించిన శృంగారరసప్రవృత్తి యిట్టిదే వినుము. మన్మథావస్థలు పదియని యిదివరకు మనము జదివి యుంటిమిగదా, నీవప్పడతిం జూచుటయే దృక్కు. దానంజేసి మనస్సంగంబు గలిగినది. పిమ్మట దానిగురించియే సంకల్పము గలుగుచున్నది. అది లభింపనిచో రాత్రులు నిద్దుర పట్టదు. దానిపేరే జాగరము. దానివలన గృశించుట తటస్థించును. ఈ రీతి అవస్థలన్నియు గ్రమంబున నుత్పన్నములు కాగలవు. ఈ గుణంబులు మనుష్యులకు సామాన్యములుగా నుపదేశంబులేకయే పొడముచుండును. తద్విశేషము లన్నియు నిటుపై నీకే బోధకాగలవు. ఇంతదనుక నన్యకాంతఁజూచి యెరుంగవు. కావున రసోదయముకాలేదని పలుకుచు గ్రమంబున విద్యామందిరమునకు దీసికొనిపోయెను.

ఆ రాత్రి జయభద్రుడు, అనంగచంద్రికాహాస దృగ్విలాసాదుల స్మరించుకొనుచు నిద్దురంజెందడయ్యె. ఉదయంబున లేచి ప్రాతఃకృత్వంబులం దీర్చుకొని యారాజకుమారుఁడు సుమిత్రునితో సుహృద్వరా! మనము దాని యింటికెప్పుడు