పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[2]

జయభద్రునికథ

17

నీకు సుఖపారవశ్యంబున గాలనియమము తెలిసినది కాదు. రమ్ము పోవుదము. మీవారు నీ కొఱకు వేచియుందురని పలికిన నులికి పడుచు లేచి అతండు తలుపుతీసి యెడజూచి అన్నా! యేమి ఇది చిత్రముగానున్నది రాత్రి అంతయు దృటిగా దోచలేదే? అని పలుకుచు మనంబున నిష్టము లేకున్నను విధిలేక అమ్మగువకు జెప్పి అప్పుడతని వెంట నింటికి జనియెను. మఱియు సుమిత్రుండు నడుచునప్పుడు రాత్రి విశేషము లేమని అడిగిన అతనికి రాజనందనుం డిట్లనియె.

గీ. రసమనంగను శృంగారరసమె రసము
   రసికురాలన వేశ్యయే రసికురాలు
   గురునికన్నను నీకన్న సరసముగను
   దెలిపె శృంగారరసపరిస్థితులనెల్ల

గీ. తెలిసికొనలేకపోయితి దేశికుండు
    జాటి చెప్పినయట్టి రసప్రసక్తి
    యనుభవములేక యిపుడారహస్యమెల్ల
    దెల్ల మయ్యెను లెస్సగా దీనికతన.

అనంగచంద్రిక యనంగచంద్రికయే ఔరా! ఆమోహనాంగి! అని మెచ్చుకొనుచు రాజపుత్రుడు సుమిత్రునితో గూడ విద్యామందిరమున కరిగెను.

ఉపాధ్యాయుండు ఆ రాజకుమారుం జూచి వీని కన్నులింతయెఱ్ఱగానున్న వేమి? అని ఆడగిన సుమిత్రుండు, ఆర్యా: ఈతడీ దివసంబున బరీక్షించు తాత్పర్యముతో రాత్రి అంతయు శృంగారరస వ్యాసంగములోనే యున్నవాడు గాన జేసి నిద్రలేకపోయినది తద్రినప్రవృతి అంతయు జక్కగా గ్రహించెను. యెందేని బరీక్షింపుడని మొగంబున జిఱునగవొప్ప జెప్పినవిని వితర్కించుచు నుపాధ్యాయు డడుగ వారిరువురకు నీరీతి సంవాదము జరిగినది.

ఉపాధ్యాయుడు - సీ. చూడందగిన వస్తువులందుఘనమెద్ది?

జయభద్రుడు - తులలేక తగువెలందుల మొగంబు

ఉపా - వలపుగైకొనదగు వానిలో నెయ్యది?

జయ - మగువల వదనాబ్జమారుతంబు

ఉపా - వీనులకింపైనవానిలో నెయ్యది?

జయ - కోమలాంగుల ముద్దుగులుకుపలుకు

ఉపా - తనువుసోకిన సుఖ బొనరించు నెయ్యది?

జయ - నెలతల సొబగైన మేను తీవ

ఉపా - గీ. అతిమధురమెద్ది?

జయ - కాంతాధరామృతంబు

ఉపా - సరసజనులకు జింతింప జాలునెద్ది?

జయ - పువ్వుబోడుల వెలలేని జవ్వనంబు