Jump to content

పుట:Karunakamu Story by Veturi Prabhakara Sastry.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామయ్యగారు బెజవాడ చేరినమర్నాడే ప్రొద్దుటిపూట శ్రీరాజాగారిదర్శనము చేయబోవడముకు ముస్తాబు అయినారు. ఆయనకెప్పుడో ఇరవైయేళ్ల ప్రాయమప్పుడు మైసూరుసంస్థానమున ఇచ్చినదుస్తులు అప్పటి ఆయన ఆకారపుష్టికి సరిపడే ఉండునుగాని అరవైయేళ్ల ప్రాయమప్పుడు ధరించబోతే ఎవరివోపాతవి యెరువు తెచ్చుకొన్నాడు కాబోలును అనిపించేటట్టు ఉన్నవి. వదుళ్లయి వ్రేలాడుతున్న ఆదుస్తులలో ఆయన మునిగిపోయినాడు. అందులో బహువత్సరములనుంచి పెట్టెచీకుళ్లయి చిమటపోట్లుపడి రంగువెలసి ఉండడముచేత మరీ వికారముగా ఉండెను. ఈసంగతి ఆయనకు తోచలేదు. ఆయన సృష్టికి అవి ఆనాటి మైసూరిసమ్మానమును స్మరింపజేస్తూ ఉత్సాహజనకముగానే ఉండెను. మైసూరికి వెళ్లినప్పటితీరుగా ఒక నిమ్మపండు, కుంకుమాక్షతలు పుచ్చుకొని శకునపరీక్ష చేసి ఎంతసేపటికీ మంచిశకునము కుదరకపోగా, పట్నవాసాలలో శకునాల పాటింపు పని లేదనుకొని ఆలస్యమైతే వర్జ్యము వస్తుందన్న తొందరచేత సాహసించి ఆయన బైలుదేరెను. శ్రీరాజాగారిబంగళాచేరి బంట్రౌతులనుబతిమాలుకొని లోనికిపోయి రాజాగారిని దర్శించి తన కథ విన్నవించుకొనెను. రాజాగారు మంచిరసికులు, సరసులు; అయినా, ఆబ్రాహ్మణుని వయస్సు వేషము ప్రథమదర్శనమందే వారికి పరిహాస్యతను కూర్చెను. ఆపైని ఆయన చెప్పినమాటలున్నూ అందుకు తగినట్టే ఉండెను. పిదపకాలపు సంగీతమని సంకర సంగీతమని అప్పటి గాయకుల సంగీతము నాయనగర్హించెను. ఫిడేలు,హార్మోనియము,మొదలయిన జంత్రములను చెడనాడెను. తాను ప్రాచీనమైన శుద్ధకర్ణాటకమును పాడగలనిన్నీ తనతోడ్పాటుచేత శ్రీవారు స్థాపించినగాయక సంఘము నాటకసంఘము ప్రఖ్యాతికి రాగల వనిన్నీ అమాయికముగా చెప్పెను. రాజాగారిది విని వెడనవ్వు నవ్విరి. 'సరే నేడో రేపో మీరు మాసంగీతశాలకు పోయి అక్కడ గాయకులు నటులు ఉంటారు వారిని కలుసుకొని మాటాడండి. తర్వాత మీవిషయము ఆలోచించి చెప్పుతాము' అని చెప్పిరి. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చినాడుగదా అని మూడురూపాయలు తెచ్చి యియ్యబోయిరి. దారిద్ర్యపు బరువు తలమీద ఉన్నప్పటికీ, ఒక్కపూట పస్తయినా పండుకొన్నాడుగాని ఆయనయింతవరకూ బిలాపడి యెవ్వరినీ యాచించి యెరుగడు. అయితే పెద్దసభకావలెను, పెద్దసమ్మానము జరుగవలెను, అనియే ఆయన తలపోత; కాని చిలిపియాచనల కాయన చేయి ఒగ్గేవాడు కాడు. అవసరముమాత్రము అర్దణా యిచ్చినా అదే పదివేలని పుచ్చుకోదగినదిగానే ఉన్నది. ఆపూట భుక్తికి ఉన్నదో లేదో! "సంగీతశాలలోనివారిని కలుసుకొంటానుగదా! తమరువారితో సంప్రతించి సంగీతపండితస్థానము దయచేయిస్తామన్నారుగదా! ఇంతలో ఇదియెందుకులెండి? నే నిందుకోసం వచ్చినవాణ్ణిగాను." అని విన్నవించి లేచివచ్చినాడు. నాడే రాజాగారు సంగీతశాలకు వచ్చి