పుట:Karunakamu Story by Veturi Prabhakara Sastry.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీస్తూ ఉండగా ఆయన కుడిచేతిచూపుడువ్రేలికి, నడిమివ్రేలికి, మండ్రగబ్బ కుట్టెను. ఆయన వారమురోజులు దానితో అవస్థ పడ్డాడు. ఆరెండువ్రేళ్లూ చివరకు బండబారి వంకరపోయినవి. ఆయనవీణావాదనశక్తి అంతటితో అంతరించినది. ఆయనకు దురదృష్టపరంపర మిక్కిలి దుర్భరముగా సాగుచున్నదిగదా! అప్పుల కింద ఇల్లూవాకిలి భూమిపుట్ర, చెల్లిపోయినవి. ఆలుమగడు కూతురు ఈమువ్వురికి, మొవ్వలో బువ్వకు గడవడమే కష్టసాధ్యమైనది. దారిద్ర్యదేవతపూనినదంటే అన్ని యోగ్యతలునుమన్నయిపోతవిగదా! ఆయనసంగీతమన్నా ఆయనమాటలన్నా, ఆచుట్టుపట్టుల వారందిరికి వేళాకోళము క్రిందికివచ్చినది. ఆయనచేత మైసూరుప్రయాణపు కథలు అప్పటిపాటకచ్చేరీకథలు పనిపాటులులేని సమయములందు యెప్పుడయినా చెప్పిస్తూ వారు వారు వేళాకోళపు పొగడ్తలు పొగుడుతూ ఉండేవారు. ఆత్మవైదుష్యమందు అతివిశ్వాసముగల ఆ అమాయికుడు, నిజముగానే తనను సంభావిస్తున్నారని సంతోషిస్తూ ఉండేవాడు. పదిపండ్రెండేళ్ళక్రిందటిమాట చెప్పుతున్నాను. ఆంధ్రదేశమందు నాటకసమాజములు పేట్రేగినవి. నాటకులలో అభినయమునుగురించి, గానమునుగురించి, స్పర్థలు, పోటీపరీక్షలు జరుగుతున్నవి. టాలాటోలీ అభినయములు టప్పాపాటలు, సంకరసంగీతములు, రూపుమాపి శాస్త్రీయపద్ధతులమీద సంగీతకళను నాటకకళను సాగించవలెనని కొందరు గందరగోళముచేస్తున్నారు. పత్రికలలో వారు వీరు ఈవిషయములమీద వ్యాసములు రాయనారంభించినారు. ఈవార్తలు మొవ్వరీడింగు రూములో కుఱ్ఱవాళ్లు చదువుతూ ఉండగా రామయ్యగారు వింటూఉండేవారు. నిజముగా అటువంటివిమర్శనము పుట్టితే తనపాండిత్యము ప్రఖ్యాతికి రాగలదని ఆయన బులపాటపడుతూ ఉండేవాడు. బెజవాడలో నూజివీటి రామారాయణంగారు క్రొత్తగా ఒకసంగీతసభ నెలకొల్పినారనిన్నీ అందులో శాస్త్రీయమైన కర్ణాటగానమే గాని పార్సీపాటలు మొదలయిన సంకర సంగీతములు ఉండవనిన్నీ అట్టిది నేర్పడముకు తగిన సంగీత విద్వాంసులు కావలసి ఉన్నారనిన్నీ, వారు నాటకకళకూడా పెంపొందించేందుకు యత్నిస్తున్నారనిన్నీ, ఆసంగీతవిద్వాంసులు అభినయవిద్యకూడా ఎరిగినవారై ఉంటే మరీ మంచిదనిన్నీ అట్టివారు బెజవాడలో శ్రీరాజాగారిని దర్శింపదగుననిన్నీ ఒకనాడు పత్రికలో ప్రకటన ఉండగా రీడింగురూములోని కుఱ్ఱలు రామయ్యగారికి తెలిపిరి. సంగీతమందు అభినయమందు తనకంటెసమర్థుడు వేరొకడు లేడనిన్నీ తానువెళ్లితే తప్పక గౌరవిస్తారనిన్నీ ఆయనతలచెను. మర్నాడే సకుటుంబముగా బెజవాడకు ప్రయాణమయివెళ్లెను. సంసారసామగ్రివారికి అట్టెలేదు. వండుకొనేగిన్నె, త్రాగేచెంబు మొదలయినవి నాల్గయిదుపాత్రలు; మైసూరులో ఇచ్చినతలగుడ్డ, అంగీశాలువులు; ఇదే సామాను. ముఖ మెరుకగల ఒక పేదరాలుపెద్దమ్మయింట్లో వారు బస చేసిరి. మంచిరోజు చూచుకొనే వచ్చినారుగనుక