పుట:Kanyashulkamu020647mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయన్లా గ్రెహించేవారేరీ? నాకవిత్వవఁంటే ఆయ్న చెవికోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు చెయించారండి.

అగ్ని-- (ధుమధుమలాడుతూ) ఈ శషభిషలు నాకేం పనికిరావు. యితడి వైఖరిచూస్తే యిక్కడే బసవేసేటట్టు కనపడుతూంది. మాయింట్లో భోజనం యంతమాత్రం వీలుపడదు.

వెంక-- ఆయనమాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది. మీదయవల్ల మావాడికో ముక్కబ్బితే మీమేలు మరిచిపోం.

గిరీశం-- అందు కభ్యంతర వేఁవిఁటమ్మా, మీవాడు శలవుల్లో చదువుచెప్పమని యంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుఱ్ఱవాడుగదా అని వొచ్చానుగాని పట్ణంలో మునసబుగారింట భోజనం లేదని వొచ్చానా, వారిచ్చేడబ్బు చేదని వొచ్చానా అమ్మా?

వెంకమ్మ-- యీ చదువులకోసవఁని పిల్లణ్ణి వొదులుకునివుండడం, వాడు పరాయివూళ్లో శ్రమదమాలు పడుతూండ్డం నాప్రాణాలు యెప్పుడూ అక్కణ్ణే వుంఛాయి. డబ్బంటే యెన్నడూ వెనక చూళ్లేదుగదా. మేం కనడంమట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రీని. యలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదేభారం.

గిరీశం-- తమరు యింతదూరం శలవియ్యాలమ్మా? నా మంచిచెడ్డలు మీ కుఱ్ఱవాణ్ణడిగితే తెలుస్తుంది. మునసబుగారూ, డిప్టీకలక్టరుగారూ యెన్నికచేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా, ఇంతెందుకూ యిక మూడేళ్లు నా తరిఫీదులో వుంచితే క్రిమినల్లో వరసగా పోలీసు పరిక్ష పాసుచేయిస్తాను.

అగ్ని-- మూడేళ్లే! యీ సంవత్సరం పుస్తకాల కెంతవుతుందిరా అబ్బీ?

వెంకటేశం-- పదిహేన్రూపాయ లవుతుంది.

అగ్ని-- ఒక్కదమ్మిడీ యివ్వను. వీళ్లిద్దరూకూడి ఆ రూపాయలు పంచుకుతినేటట్టు కనపడుచూంది. నేను వేదం యనబైరెండు పన్నాలూ ఒహదమ్మిడీ పుస్తకాలఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది.

కరట-- (నవ్వుతూ) కోట్లకి విలవైనమాట అన్నావు బావా!

గిరీశం-- (కరటకశాస్త్రితో) దిసీజ్‌ బార్బరస్‌, చూచారండీ, జెంటిల్మేన్‌ అనగా పెద్దమనిషిని యలా అంటున్నారో! నేను యిక యిక్కడ వుండడం భావ్యం కాదు, శలవు పుచ్చుకుంటాను.

వెంకమ్మ-- చాల్చాలు బాగానేవుంది! యింటి కెవరొచ్చినా నాకిదే భయం, ఆయన మాటల కెక్కడికి బాబూ, వెళ్లిపోకండి.