పుట:Kanyashulkamu020647mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరటక-- అగ్నిహోత్రావుధాన్లూ! కుఱ్ఱవాడికి రవ్వంతచదువు చెప్పించడానికి ఇంత ముందూవెనకా చూస్తున్నావ్‌. బుచ్చమ్మనమ్మిన పదిహేను వొందల రూపాయిలేంజేశావ్‌?

గిరీశం-- సెల్లింగ్గర్ల్స్‌! డామిట్‌!

అగ్ని-- ప్ర`తీగాడిదె కొడుకూ అమ్మావమ్మా వంచూంఛాడు. కూరగా యల్షోయ్‌ అమ్మడానికీ? ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడుగదా, దాని గతి యావైఁయ్యుండును?

కరట-- చచ్చాడంటే వాడిదా తప్పు, మంచంమీంచి దించెయడానికి సిద్ధంగా వున్న వాడిక్కట్టావ్‌!

గిరీశం-- తమరేనా నులక అగ్నిహోత్రావుధాన్లుగారు? యీ పట్టెని జటలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మావాళ్లనుకునేవారు.

అగ్ని-- మీది రాజమహేంద్రంషండీ? ఆ మాట చెప్పారుకారేం? రామావుధాన్లుగారు బాగున్నారా?

గిరీశం-- బాగున్నారండి. ఆయన మా మేనమావఁగారండి.

అగ్ని-- ఆ మాట చెప్పా`రుకారూ?

గిరీశం-- మామావఁ యీ దేశబ్భోగట్టా వొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తూంటారండి.

అగ్ని-- నాకూ వారికి చాలాస్నేహం. చూశారా కొంచం నాకు ప్రథమకోపం. యవరో తెలియకుండా అన్నమాటలు, గణించకండేం.

గిరీశం-- దానికేవఁండి, తమవంటి పెద్దలు అనడం మాలాంటి కుఱ్ఱవాళ్లు పడడం విధాయకవేఁగదండీ?

కరట-- (తనలో) యిన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు.

అగ్ని-- చూశారండీ, మీపేరేవిఁటండీ?

గిరీశం-- గిరీశం అంటారండి.

అగ్ని-- చూశారండి, గిరీశంగారూ! మా కరటక శాస్తుల్లు వట్టి అవకతవక మనిషి; మంచీ చెడ్డా యేమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యెంతలాభం కలిగింది. భూవుఁలకి దావా తెచ్చావాఁలేదా? నేను యీమధ్య దాఖల్చేయించిన పిటీషను మీద ఆర్డరు చదివి పెట్టండి (గదిలోకి వెళ్లి కాకితంతెచ్చి గిరీశంచేతికి యిచ్చును.)

గిరీశం-- (చూసి) ఎవడో తెలివితక్కువ గుమాస్తా వ్రాసినట్లుంది. అక్షరపొలికే లేదండి.