పుట:Kanyashulkamu020647mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ-- నీకంటా? మరిచిపోయినానుసుమా!

మధు-- యేమిచిత్రం! నన్ను మరిచారు - నావస్తువని మరిచారు. మరిచి, ఆగుంటకిచ్చారు. దాన్ని లేవదీసుకుపోయి యెక్కడోదాచి, నిశిరాత్రివేళ పెద్దమనిషిలా, యింటికివొచ్చారు!

రామ-- ఆగుంట కనపడ్డదా యేవిఁటి?

మధు-- యేవిఁనాటకం! మీకు కనపడకేం? మీరు పెట్టినచోటేవుంది.

రామ-- మీనాక్షి తన్నితగిలేశిందా యేవిఁటి? కంటెతో తగిలేస్తేచచ్చానే?

మధు-- యేమినాటకం! చావండి; బతకండి; ఆకంటెతాందీ, గడపలో కాలుపెట్టనివ్వను.

(తలుపు వేయును.)

రామ-- నాలుగుకోసులు గుఱ్ఱపసవారీ అయి, యీదురోమని యిల్లుచేరుకుని, గుమ్మంలో అడుగుపెట్టేసరికి, మబ్బులేని పిడుగుపడ్డది. మీనాక్షి ఆగుంటని మన్ననిస్తుందని, నేను యెన్నడయినా అనుకున్నానా యేవిఁటి? ఆగుంట పోతేపోయింది, వుంటేవుంది; నాకంటె పోకుండావుంటే అదృష్టవంతుణ్ణి. కంటెఅడగడానికి వెళితే, "నువ్వే యీ పెళ్లి కుదిర్చావు" అని కఱ్ఱుచ్చు కుంటాడేమో!

(నిష్క్రమించును.)

3-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటివాకలి.

లుభ్ధావధాన్లు-- (పచారుచేస్తూ)

కనపడకపోతే యేవైఁనట్టు? నూతులోగానీ పడిందా? పోలీసువాళ్లు యిల్లుదోచేస్తారు. నూతులో పడలేదా? పడకపోతే యేవైఁనట్టు? - రావఁప్పంతులు యింటికి పోయుంటుంది. అంతే కావాలి - యంత అందవైఁన పిల్లా! నాదిగాక దురదృష్టం! యంతట్లో వెన్నెల చీకటైందీ! రేపో యెల్లుండో యెదిగొచ్చే పిల్లగదా అని సంబరపడ్డాను - ఒహవేళ, - అప్పుడే పెద్దమనిషైందేమో? - అందుకు సందేహవేఁలా? లాకుంటే యింత యేపైన పిల్ల పెద్దపడుచు కాకుండావుంటుందా? యిలాంటివి యెన్నిపెళ్లిళ్లు చేసుకుని యందరు మొగుళ్లని కడతేర్చిందో! ఓరి కుంకపీనుగా, నీకళ్లు యేవైఁపోయినాయిరా? రజస్వలాముండని చూస్తూ, చూస్తూ, యలా పెళ్లాడావురా? మరి నీకు గతులు లేవు. రాజమహేంద్రవరంలో వెధవ ముండల్ని పెళ్లాడినవాళ్ల సామాజికంలో చేరావురా? అయ్యో! అయ్యో! దీనికి మరి ప్రాయశ్చిత్తం యక్కడిది? ఒహవేళ చేయించుకుందా వఁంటే, శంకరాచార్యులు పాదకట్ణం పెట్టమంటాడు. బ్రాహ్మలు యిల్లు తినేస్తారు. అంతకంటె పోలీసువాళ్లు