పుట:Kanyashulkamu020647mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నయం. అల్లరికాకుండా హెడ్డుచేతులో పాతిక రూపాయలుపెట్టి, రేపురాత్రి బయల్దేరి కాశీపోయి, గంగలో ములిగానంటే అన్ని పాపాలూ పోతాయి. కాశీవాసవేఁ చేసుకుంటాను. భగవంతుడు బుద్ధొచ్చేటట్టు చేశాడు. లేకుంటే, ముసలివెధవకి పెళ్లిచేసుకోవడపు పోయీ కాలవేఁవిఁ? అన్నివిధాలా యీ రామప్పంతులు నాకొంప తీశాడు.

(రామప్పంతులు ప్రవేశించి.)

రామ-- యేవిఁటి మావాఁ రావఁప్పంతులంటున్నారూ?

లుబ్ధా-- యేవీఁలేదూ.

రామ-- యింతరాత్రివేళ పచారు చేస్తున్నారేవిఁ?

లుబ్ధా-- యేమీలేదు - నిద్దరపట్టక.

రామ-- మావఁగారూ, ఆకంటె యిప్పుడు తెమ్మని మధురవాణి భీష్మించుకు కూచుంది. శ్రమ అని ఆలోచించక యిప్పించాలి.

లుబ్ధా-- కంటేవిఁటి?

రామ-- మీభార్యాకి పెట్టిన కంటండీ.

లుబ్ధా-- నాభార్యాకి నేను పెట్టలేదు.

రామ-- మీరు పెట్టమంటే, నేను యెరువుతెచ్చానుకానా?

లుబ్ధా-- నేను పెట్టమన్లేదు.

రామ-- అయితే దొబ్బేస్తావా యేవిఁటి? మీభార్యామెళ్లో యిప్పుడా కంటలేదూ?

లుబ్ధా-- నాభార్యా యెవరు? నాభార్యానాడే చచ్చింది.

రామ-- మొన్న మీరు పెళ్లిచేసుకున్న పిల్ల మీభార్యా కాదటయ్యా?

లుబ్ధా-- రెండో పెళ్లిముండ నాకుభార్యా యేవిఁటి?

రామ-- రెండో పెళ్లిముండేవిఁటి?

లుబ్ధా-- రెండో పెళ్లిముండ అని నువ్వే అన్నావు?

రామ-- మాటమీద మాటొచ్చి, వొట్టినే అంటే, అదో దెప్పా?

లుబ్ధా-- వొట్టినే అనలేదు. గట్టే అన్నావు. యిదంతా, ఆగుంటూరు శాస్తుల్లూ నువ్వూచేసినకుట్ర; నాకు నిజం తెలిసిపోయింది. ఆముండ నీ యింటికేవెళ్లింది. మధురవాణిని వుంచుకున్నట్టు దాన్నికూడా నువ్వేవుంచుకో. నాజోలికిరాకు. నీకు పదివేల నమస్కారాలు.

రామ-- నాకంట నాకియ్యమంటే, యీవెఱ్ఱి వెఱ్ఱిమాట లేవిఁటయ్యా?

లుబ్ధా-- నీమాయగుంటా, నీకంటా, నీయింట్లోనే వున్నాయి.