పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41. విష్ణువు:- ఇది చాలా అందమైన విష్ణువు విగ్రహము. స్వామివారు చతుర్‌భుజుడు. చేతులందు పద్మము, శంఖము, చక్రము, గద కలిగియున్నాడు. చతుర్ వింశతి మూర్తులందలి "గోవిందుని" రూపమిది. ఇరువురు చామరగ్రాహిణులు ఇరువైపుల కలరు. క్రీ. శ. 12 శతాబ్దము. (చిత్రము - 8)

42. సరస్వతి:- చదువులదేవి సరస్వతి. పద్మపీఠముమీద పద్మాసనాసీన అయియున్నది. మూడు యాళిమృగములు భద్రపీఠముమీద చెక్కియున్నవి. క్రీ. శ. 12 శతాబ్దము.

43. విష్ణువు:- సమపదస్థానకము నందలి విష్ణువిగ్రహమిది. చతుర్‌ భుజుడు. అందు శంఖచక్రగదా పద్మములు కలిగియున్నాడు. చాళుక్యలక్షణములు కల ఈ మూర్తి, చతుర్‌వింశతి మూర్తులందలి "కేశవమూర్తి" రూపముగానగును. కటిబంధము, కంకణ కేయూరములు, ముత్యాలహారములు, కర్ణాభరణములు కలిగియున్నాడు. కిరీటము చెడిపోయియున్నది. కిరీటమకుటము కానోపు, పాదముల తాకు ధోవతి, దానికి ముందు విపులముగా గల పటకము అందముగా ఉన్నది.

44. కోదండరాముడు:- విష్ణువుయొక్క దశావతారములందు శ్రీరామావతారమునకు ప్రత్యేకత కలదు. ఇతను సంపూర్ణ మానవుడని విజ్ఞుల అభిప్రాయము. ఇతను సామాన్యముగా త్రిభంగమందు కోదండము ధరించి సీతాలక్ష్మణ సమేతుడై యుండును. కాని ఇచ్చట కోదండరాముడు సమపద స్థానక మూర్తి. కుడిచేతి యందు బాణము, ఎడమచేతి యందు ధనుస్సు ధరించియున్నాడు. వస్త్రధారణ, ఆభరణములు విజయనగర శైలియందు కలవు. కిరీటమకుట ధారి. క్రీ. శ. 16 శతాబ్దము (చిత్రము - 9).

45. బ్రహ్మ:- చతురప్రాకారపు రాతిఫలకము. బ్రహ్మ పద్మపీఠముమీద నిలచియున్నాడు. కొంత విరిగిపోయియున్నది. చతుర్‌భుజుడు. మొదటి రెండు చేతులు అంజలిఘఠించియున్నవి. పైరెండు చేతులందు ఆజ్యస్థాలి (నేతికలశము) తావలము కలవు. ఇతనికి మూడు తలలు కలవు (నాలుగవది వెనుకయున్నటుల గ్రహింపవలయును). ఈ నాలుగు ముఖములు నాలుగు వేదముల సూచించును. వాటిని మణిమయ కిరీటము లలంకరించియున్నవి. (జటామకుటము యుండుట కూడ కలదు). హంస వాహనము పీఠముమీద కలదు. కటిసూత్రము, యజ్ఞోపవీతము మొదలగు ఆభరణములు దేహము నలంకరించి యున్నవి. శివునిదో లేక సావిత్రిదో ఒక చేయి శూలమును ధరించియున్నది, కాని విగ్రహము విరిగిపోయినది. పశ్చిమ చాళుక్య విగ్రహము. క్రీ. శ. 12 శతాబ్దము.