పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36. ఉమామహేశ్వరులు:- ఒక ఫలకమునందు శివపార్వతులు భద్రపీఠము మీద సుఖాసీనులైయున్నారు. నందివాహనము పీఠముమీద చెక్కబడియున్నది. శివునికి జటామకుటము, యజ్ఞోపవీతము కలవు. వామపార్శ్వమున పార్వతికలదు. ఈమెకు రెండుచేతులు. కుడిచేతియందు పద్మము, ఎడమచేయి సింహకర్ణమునందు కలదు. ఈమె కరండమకుట ధారిణి. ఈమె సర్వాభరణభూషిత అయి, శివుని భుజముల వరకూ వచ్చియున్నది.

37. సూర్యుడు:- కమల బాంధవుడు. తన రెండుచేతులందు సగమువికసించిన పద్మములను ధరించియున్నాడు. అవి అతని భుజములవరకూ వచ్చియున్నవి. ఉదరబంధముకలదు. పాదములకు పాదరక్షలులేవు.

38. కుబేరుడు:- ఇతను ధనపతి. ధనపతి యక్షవంశపు రాజు. కనుక అందరు యక్షులవలె కుంభోదరుడు (కుండపొట్టకలవాడుగా చూపబడెను). చతుర్‌భుజుడు. అన్ని ఆభరణములనూ ధరించియున్నాడు. ఉదరబంధము, మణిమయ కిరీటము కలిగియున్నాడు. అతని కుడిచేతియందు పుష్పము (పద్మము) కలదు.

39. ఆలింగన చంద్రశేఖరమూర్తి:- ఈ రాతిఫలకమునందు పార్వతీ పరమేశ్వరులు నిల్చొనియున్నారు. శివుడు తన వామహస్తముతో పార్వతిని ఆలింగనము చేసుకొనియున్నట్లు చూపబడెను (భుజముమీద చేయి వేసియున్నాడు). కుడిచెయ్యి తన నడుము మీద పెట్టుకొనియున్నాడు. శివుని శిరస్సున జటాజూటము కలదు. ఇరువురు ముఖములు చెడిపోయియున్నవి. పార్వతి తలవెంట్రుకలు ధమ్మిల్లముగా అమరియున్నవి. ఆమెవస్త్రము బాగా పొడవుగా పాదములను తాకుచూ ఉన్నది. సర్వాభరణ భూషిత.

శివుడు చతుర్‌భుజుడు. అతని చేతులందు కుడివైపునుంచి అభయహస్తము, త్రిశూలము, సర్పము (తావళము) ధరించి, నాలుగవ చేతితో ఆలింగనము చేసుకొని యున్నట్లు కలదు (నాలుగవచేయి పార్వతి భుజముమీద వేసియున్నది). పార్వతి వామహస్తమున నీలోత్పలము ధరించి, కుడిచేతిని నడుముమీదపెట్టుకొని త్రిభంగిమమందు నిలిచి యున్నది.[1] చాళుక్య శిల్పము. క్రీ. శ. 11 శతాబ్దము.

40. చాముండ:- సప్తమాతృకలలో ఒక మాతృక చాముండ. ఈమె చతుర్‌ భుజములు కలిగి అందు త్రిశూలము, కలశము, ఖడ్గము, డమరుకము, ధరించియున్నది. మామూలుగానుండు ఎముకలపోగు ఆకారముగాక ఈమె దృడముగా ఉన్నది. మామూలు ఆభరణములు (చాళుక్యశైలిని) ధరించియున్నది. క్రీ. శ. 12 శతాబ్దము. (చిత్రము - 7)

  1. పార్వతి తన కుడి పాదమును శివుని పాదముల మీద మోపి, కుడిచేతిని శివుని నడుము దగ్గర పెట్టి ఆలింగనము చేసుకొనవలయును.