పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహించినట్లు తెలిపియున్నది. ఆ తరువాత క్రీ. శ. 1097 నకు చెందిన శాసనములో కొలనుపాక స్వయంభూ సోమేశ్వరులవారికి ఒక గ్రామము సర్వభుక్తముగా దానము చేయబడినటుల తెలుపుచున్నది. మరొక శాసనములో తొండయ్య చోళదేవ మహారాజును నతను కొలనుపాకకు మహామండలేశ్వరుడుగా ఉండినటుల తెలుపుబడెను. ఇతను ఇచ్చటనున్న విష్ణుదేవాలయమునకు కొన్ని దానములు చేసినటుల తెలుపుచున్నది.

మరియొకశాసనము చాళుక్య విక్రమశకము 29కి అనగా క్రీ. శ. 1104 నాటిది. ఇందులో పారమార వంశజుడు జగద్దేవుడనువాడు కొలనుపాక రాష్ట్రమునకు మహామండలేశ్వరుడై యుండగా మహారాజుకు సేనాపతి, సంధివిగ్రహి అయిన సోమలదండనాయకుడు రాజ్యపురోభివృద్ధికి, శాంతి సౌభాగ్యములకొరకై ఒక జగద్దేవనారాయణస్వామి వారి ఆలయము రాష్ట్రముఖ్యపట్టణమైన కొలనుపాకయందు నిర్మించినాడట. తరువాత చాళుక్య విక్రమశకము 31 అనగా క్రీ. శ. 1107 కు చెందిన దానిలో అనంతపాల దండనాయకుడు కొన్ని సుంకముల ద్వారా వచ్చు ధనమును కొలనుపాకయందలి జగద్దేవనారాయణస్వామివారి కైంకర్యమునకై దానముచేసినటుల తెలియుచున్నది. ఇక ఆఖరి శాసనము క్రీ. శ. 1125 నాటికి చెందినది. ఇందు మహామండలేశ్వర చాళుక్య గాంగపెరమాది కుమార సోమేశ్వరుడు, కొలనుపాక దండనాయకుని కోరినమేరకు అచ్చట అంబిక యను దేవతకు కొంత దానము చేసినాడట. నల్లగొండ జిల్లా గూడూరు గ్రామమునందు దొరికిన ఒక శాసనములో స్వామిపయ్య యనువాడు, కుమార సోమేశ్వరుని దండనాయకుడు కొలనుపాక రాష్ట్రమున కధిపతిగా ఉండినటుల తెలుపుచున్నది. [1]

ఆరవ విక్రమాదిత్యుని తరువాత మూడవ సోమేశ్వరుడు, ఆ తరువాత రెండవ జగదేకమల్లుడు రాజ్యమునకు వచ్చిరి. ఇతని కాలపు శాసనము కొలనుపాకయందు దొరకినది. ఇందు దుర్గ సంరక్షణాధికారి మనెవెర్గడె నన్నపయ్య యనువాడు సోమేశ్వరస్వామివారికి (స్వయంభూ సోమేశ్వరస్వామి) కొంత భూమిని దానముగా ఇచ్చినాడట. [2]

కళ్యాణి చాళుక్యవంశము క్షీణించినతరువాత వారిక్రింద సామంతులుగా నుండిన కాకతీయ ప్రభువుల పాలనలోనికి కొలనుపాక వచ్చినది. కాకతీయ రుద్రదేవుని శాసనము, మొరిపరాలలోనిది. క్రీ. శ. 1181 రుద్రమాంబ శాసనము వలన, కొలనుపాక తన పూర్వపు టౌన్నత్యమును పోగొట్టుకొనినట్లు తెలియుచున్నది. కాకతీయ రాజ్య ముఖ్యపట్టణమైన ఓరుగల్లు; ఇచ్చటికి చాలా సమీపములో నుండినందున

  1. చాళుక్యకుమార సోమేశ్వరుని ప్రశస్తి.
  2. సోమేశ్వరస్వామి దేవాలయమునకు చేసిన భూదాన శాసనము.