పుట:Jyothishya shastramu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ స్థానము అర్ధాంగి భాగమునకు కేంద్రముగాయుండి పాపపుణ్యములకు నిలయమైయుండగా, తొమ్మిదవ స్థానము మాత్రము పూర్తి పుణ్యస్థానమై యుండి పుణ్య స్థానములకు కోణముగాయున్నది. ఇప్పుడు 1,5,9 అను మూడు కోణములలో తొమ్మిదవ స్థానముగాయున్న దానిని గురించి తెలుసు కొందాము. ఇది పూర్తి పుణ్యస్థానమే అయినా ఈ స్థానములో జనన కాల సమయమున మిత్రవర్గమునకు చెంది పుణ్యమును పాలించు శుభగ్రహము ఉండవచ్చు లేక శత్రువర్గమునకు సంబంధించిన పాపమును పాలించు అశుభగ్రహము ఉండవచ్చును.

జనన సమయములో పుణ్యమును పాలించు శుభగ్రహము తొమ్మిదవ స్థానములో ఉన్నా లేక ఆ స్థానమును శుభగ్రహము యొక్క చేతులు తాకినా మంచి ఫలితము కల్గును. తండ్రి సంపాదించిన ఆస్తి జాతకునకు తృప్తిగా లభించును. భక్తి, దాన, తపస్సులను చిత్తశుద్ధితో చేయును. దైవభక్తి మరియు గురుభక్తి ఈ జాతకునికి ఉండును. తొమ్మిదవ స్థానమును భాగ్యస్థానమని కూడ చెప్పవచ్చును. ఎందుకనగా డబ్బు రూపముగానున్న ధనము ఈ స్థానములోనుండే లభించుచున్నది. ఇక్కడున్న శుభగ్రహము ఈ స్థానములోని పుణ్యమును స్వీకరించి డబ్బురూపముగా ఇచ్చును. డబ్బు చలామణి బాగా ఉండడమేకాక డబ్బు నిలువయుండును. డబ్బును ఈ జాతకుడు సులభముగా సంపాదించి నిలువ చేసుకొనును. ఈ స్థానములోనున్న పుణ్యమువలన శుభకార్యములు ఎక్కువ జరుగును. శుభకార్యములను చేయుట, పాల్గొనుట జరుగును. మంచివారి సహవాసము, భక్తుల, జ్ఞానుల స్నేహము కల్గును. సకల ఐశ్వర్యములు కలుగును. వివాహములు వైభవముగా జరిపించును. వివాహములలో పాల్గొని గౌరవమును పుణ్యమును సంపాదించుకొనును. న్యాయసమ్మతమైన