పుట:Jyothishya shastramu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బురుజులు, సోదరబలము, చెల్లెండ్రు, వెంట్రుకలు, మీసము, కృరమైన ముఖవర్చస్సు, దీర్ఘబాహువులు, అంగరక్షకులు, పోలీస్‌లు, మిలటరీ, కందులు, సన్మానములు, సైన్య బలము (మనుషుల అండ) రాతి గుహలు, రచ్చబండలు, మంగమాణ్యములు, కుమ్మర మాణ్యములు, కుమ్మరాములు, వ్రణ వైద్యము, పిందెలు, కాయలు, మంగళవారము, నక్సలైట్లు మొదలగు నవన్నియు కుజగ్రహము యొక్క ఆధీనములో ఉండును.

ఒక వ్యక్తి జాతకములో కుజగ్రహము శత్రు స్థానములోయుంటే అతని యవ్వనములో సుఖము లేకుండ చేయును. నీచ స్త్రీల సాంగత్యమును కల్గించును. జాతకములో ఏడవ స్థానమును కుజుడు చూచినా, కుజుడు ఉన్నా అతనికి యుక్తవయస్సులో పెళ్ళి కాకుండ చేయును. ఎనిమిదవ స్థానమును కుజుడు తాకిన అతను ఆయుధముల చేత చంపబడును. ఆరవస్థానమును తాకినా లేక చేరినా మృగముల చేత గాయపడును. లేకపోతే ఆయుధములచేత దాడిజరిగి గాయపడడము జరుగును. శరీరములో పుండ్లు పుట్టును. టి.బి. రోగము, క్యాన్సర్‌ రోగము కుజుని వలననే కుజుడు శత్రువై ఆరవ స్థానమును చేరినప్పుడు కల్గును. ఒకవేళ జాతకునికి కుజగ్రహము మిత్రుడైయుంటే ఇప్పుడు చెప్పిన బాధలన్నీ యుండవు. అటువంటివి కలుగకుండా చూచుకొనును. చిన్నవయస్సులోనే పెళ్ళి చేయును. రోడ్డు ప్రమాదము జరిగినా కుజ గ్రహము అనుకూలముగా యుండినప్పుడు అతనికి ఏమాత్రము గాయము కూడా కాదు. అదే కుజుడు శత్రువుగాయుంటే గాయాలపాలు చేయును, రక్తపాతమును పుట్టించును. ఈ విధముగా కుజగ్రహము కర్మచక్రము మీద తన కిరణములను ప్రసరించుచూ ఒక్కొక్క స్థానమువద్దయున్నప్పుడు ఆ స్థానములోగల కర్మను అనుసరించి కుజుని నుండి ఫలితము దక్కును.