Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆహారము

వికారిణి ఎట్లు ఆహారముతినును?

వికారిణి తనపాదములను అటునిటు పెంచి చాచి ఆహారము నిముడ్చుకొనును. దానికి కణకవచము లేదు. వృక్షజాతికణము చుట్టును సెల్లులూసు కవచ ముండుటచేత వెలుపలనుండి ఘనపదార్థ మేమియు కణములోనికి ప్రవేశించుటకు సాధ్యము కాదు. దీనిమూలపదార్థము పాదములుగా వ్యాపించుట కీ కణకవచ మభ్యంతర మగును. అట్లయిన నిది యెట్టి ఆహారము తిని బ్రతుకును? దానికి నోరు లేదు గదా, ఎట్లుతినును? అను నంశములను విచారింపవలసియున్నది.

వృక్షజాతి సూక్ష్మజీవు లెట్లు ఆహారముతినును?

మన మెంతకాలము సూక్ష్మదర్శనితో నీసూక్ష్మజీవులను పరీక్షించినను, అవి యటునిటు పరుగులెత్తుటయే చూడగలముగాని యేవస్తువునైనను చేరుటగాని, స్పృశించుటగాని, పట్టుకొనుటగాని చూడ నేరము. హరితకములు గల సూక్ష్మజీవులు నివసించు నీళ్లలో నెల్లప్పుడు కొన్ని నత్రజనసంబంధమైన పదార్థములును (Nitrogenous Substances), స్వల్పమాత్రముగ లోహాదులును, లీనమైయుండును. సూక్ష్మజీవులయొక్క ఆవరణకవచము మిక్కిలి పలుచని దగుటచేత, వెలుపలనుండి వాయువులును నీరును లోపలికి కొంచెముకొంచెముగా ఊరుచు జొచ్చుచుండును. ఈ నీటిలో కరిగియున్న నత్రితములును ఈషన్మాత్రము లోహాదులును ఈ నీటితోపాటు కణములోనికి పోవుచుండును. అయిన నీపొరగుండ స్రవించు విధానము వడబోత గుడ్డగుండగాని, నిర్జీవ