Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగము లక్కడక్కడ చిమ్మబడి యున్నట్లు కనిపించును. ఈభాగములయందలి మూలపదార్థపు అణువులమధ్య నుండు సందులలో నీ పసిరికరంగునలుసులు గుంపులుగుంపులుగ నిమిడియుండుటచేత వాని కీ యాకుపచ్చరంగు గలుగుచున్నది. ఈ పసికరంగు నలుసులకు హరితకము లనిపేరు. హరిత మనగా ఆకుపచ్చ రంగు. హరిత వర్ణముగల నలుసులు హరితకములు. వృక్షకణము (Vegrtable cell) యొక్క లోతట్టున హరితకము లన్నియు నొక వరుసగా నేర్పడియుండును. ఆకుపచ్చగ నుండు సూక్ష్మజీవుల మాలపదార్థములో నీ హరితకములు చిమ్మబడియుండును.

సూక్ష్మజీవులలో కొన్నిటియొక్క కణకవచము సెల్లులూసు (cellulose) అను నొకతరహా దూదితో చేయబడినదిగా నుండవచ్చునని చెప్పియుంటిమి. ఇట్టి కణకవచము గల సూక్ష్మజీవులు వృక్షజాతిలోనివి. వృక్షజాతికణముల కిట్టి కవచ మావశ్యకము. ఈ దూదియే మరియొక రూపముగా మారి పెద్దమ్రాకులకు కఠినత్వమును, జిగియును కలుగజేయు పదార్థముగా నేర్పడుచున్నది. వరిపిండియు (Starch) సెల్లులూసును (C6 H10 O5) రెండును కూడ 6 భాగములు కర్బనము, 10 భాగములు ఉజ్జనము, 5 భాగములు ఆమ్లజనము, వీనిసమ్మేళనముచే నేర్పడిన వగుటవలన నొకదానితోనొకటి సంబంధము గలవిగా నున్నవని రసవాదశాస్త్రజ్ఞుల సిద్ధాంతము.

వికారిణికిని, వృక్షజాతికణములకును ఆహారము తిను రీతుల యందు గల తారతమ్యముల నాలోచింతము.