Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైన పలుచని పొరగుండగాని ఒకవైపుననుండి మరియొకవైపునకు దిగునట్టి వడబోతవంటిది కాదు. ఎందుచేత ననగా: ఈ సూక్ష్మజీవులు జీవించెడి నీళ్లలో కొన్ని పదార్థములు వానికి వలసినంతకంటె హెచ్చుగను, అనవసరమైన వస్తువులనేకములుగను, మిక్కిలి యగత్యమైన వస్తువులు కొన్నివేళల నతిస్వల్పముగను, ఉండవచ్చును. అట్టిపదార్థము లన్నిటిలో సూక్ష్మజీవులకు ఏయే వస్తువులు ఎంతెంత కావలెనో ఆయావస్తువు లంతంతమాత్రమే పొరగుండ పోవుచుండునుగాని, హెచ్చుతగ్గులుగ పోనేరవు. వడబోత గుడ్డగుండ గాని, జీవములేని పొరగుండ గాని, మనము వడబోసినప్పుడు, పైవైపుననున్న నీళ్లలో లీనమైయున్న పదార్థములు క్రిందివైపునకు సమూలముగ దిగును. అనగా పై నీటిలో ఏయేపదార్థములు ఎంతెంత యున్నవో క్రిందికి దిగు నీటిలోను ఆయాపదార్థములు అంతంతయే యుండును. పై నీటిలో ఉప్పు కలిసియున్నయెడల క్రింది నీటిలోగూడ ఉప్పుండును. అంతేకాక పై నీ రెంత యుప్పగా నున్నదో క్రిందికిదిగు నీరును అంత యుప్పగానే యుండును. వానికి వెలుపల నుండు నీటిలో ఉప్పు విశేషముగా నున్నను మిక్కిలి తక్కువగానున్నను సూక్ష్మజీవుల కెంతటి యుప్పని నీరు తీసికొనవలెనని యిచ్ఛగా నుండునో అంతటి యుప్పగానే యుండు నీరు సూక్ష్మజీవుల లోపలికి ఊరుచుండును. కాని అంతకంటె హెచ్చుతగ్గులుగ నుండు ద్రవములు సూక్ష్మజీవులు బ్రతికియున్నంత కాలము లోపలికి ప్రవేశింపనేరవు. దీనినిబట్టి జీవించియున్న సూక్ష్మజీవులయొక్క మూలపదార్థమునకు