Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలపదార్థము మిక్కిలి ఘనత్వము (Solidity) గాని, మిక్కిలి ద్రవత్వముగాని చెందని జిగటవంటి యొకపదార్థము. ఇది నీళ్ళతో గలసిన తుమ్మ బంకవలెను, శర్కర పాకమువలెను, ఉండును. ఈ మూలపదార్థ మేయే ద్రవ్యములతో జేయబడినదని రసాయన పృథక్కరణము చేసిచూడగా నిందు ఆమ్లజనము (ప్రాణవాయువు: Oxygen), ఉజ్జనము (Hydrogen), నత్రజనము (Nitrogen), కర్బనము (బొగ్గు Carbon), గంధకము, స్ఫురము (Phosphorous) అనుతత్వద్రవ్యములుమాత్ర మందు గానవచ్చు చున్నవి. ఇట్లు ఈమూలపదార్థము కేవలము రాసాయనిక మిశ్రణము (Chemical compound) అయినందున, శాస్త్రజ్ఞులు కష్టపడినయెడల ఇట్టి పదార్థమును ప్రయోగశాలలో బుట్టింప వచ్చునని తలచిరి. కాని యెక్కుడు సామర్థ్యము గల సూక్ష్మదర్శిని యంత్రముల సహాయమువలన పరీక్షించి పరీక్షించి చూడగా నీ మూలపదార్థమనునది కేవలరాసాయనిక పదార్థముగాక యనేకావయవములుగల యొక యంత్రమనియు, ముడుచుకొనుట, ఆహారమును తినుట, వృద్ధియగుట, సంతానోత్పత్తి మొదలగు జీవలక్షణములన్నియు దీనియందు ఈఅవయవనిర్మాణమువలననే యున్నవనియు దేట తెల్లంబయ్యెను. ఇ ట్లిది జీవయంత్రములలోని యత్యంతసూక్ష్మయంత్రము; ఆదియంత్రము. ఇందులో నుండియే యన్ని జీవములుపుట్టును. ఇది యెటులపుట్టెనన్న విషయ మెవరికిని తెలియదు. ఎన్నియో కోట్ల సంవత్సరములక్రిందట గొన్ని జడపదార్థముల సమ్మేళనము వలన మూలపదార్థము కలిగియుండవచ్చుననియు, అది క్రమక్రమముగా నిప్పుడు మనకు గానవచ్చెడిస్థితికి వచ్చి యుండుననియు గొందఱుశాస్త్రజ్ఞు లూహించెదరు. కాని యివి వట్టియూహ లయియున్నవి. శాస్త్రవిషయములు కావు.

ఇక మనము మూలపదార్థమను యంత్రముయొక్క నిర్మాణమునుగుఱించి కొంత కనుగొందము. మూలపదార్థమనునది యొక సూక్ష్మ బిందువు. బలవంతమైన సూక్ష్మదర్శని బెట్టి చూచినగాని యందలినిర్మాణము మనకు గానరాదు.

ప్రతిమూలపదార్థ బిందువులోను కణద్రవ్యమనియు (Cell substance) జీవ స్థానమనియు (Nucleus) రెండుభాగము లుండును. కణద్రవ్యము వలయొ