పుట:Jeevasastra Samgrahamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వపోషణమును, శరీరపోషణమును చేయవలసియున్నది. అట్లయిన గాని శరీరమంతయు నభివృద్ధి చెంద నేరదు.

ఈ జీవకణములను గుఱించి మఱియొక గొప్ప వింతకలదు. కొన్ని యతి సూక్ష్మజీవులు ఏకకణముగనే యుండునని యిదివఱకు వ్రాసియున్నాము. ఇట్టి యేకకణమయజీవులు జంతువులలోను, వృక్షములలోను గలవు. కడమ జీవు లన్నియు బహుకణమయములు. కాని యివియన్నియు గర్భోత్పత్తి సమయమునందు నేకకణయుతములు గానే యుండి తరువాత గ్రమక్రమముగా కణము లభివృద్ధియై యది బహుకణమయమగును. శుక్లశోణితములు కలసి గర్భోత్పత్తి యైనపుడు మనుజుడు కూడ అతిసూక్ష్మమైన యేకకణముగా నుండును. క్రమక్రమముగా నాకణము ద్విఖండన విధానంబున రెండై, నాల్గయి, యెనిమిదియై, పదియా ఱై, యసంఖ్యకణములుపుట్టి, అందు గొన్నితలగను, కొన్ని చేతులుగను, కొన్ని పొట్టగను, కొన్ని కాళ్లుగను, కొన్ని హృదయముగను, కొన్ని జ్ఞానతంతువులుగను ఏర్పడి, కోట్యానుకోటికణమయంబై, అత్యద్భుత రచనానిర్మాణంబుగలిగి, అనన్యసామాన్యవిజ్ఞానశోభిత మైనమానవశరీర మేర్పడుచున్నది.

మూలపదార్థము.

ఇట్టియద్భుతమైనకణమును విచ్చి యం దేమున్నదియు గనుగొందము. ప్రతికణమునందును మూలపదార్థమను (Protoplasam) నొక ద్రవ్యము కానవచ్చును. ఇది జీవత్వమునకు ముఖ్యాధారమైన పదార్థము. ఈపదార్థమునకును సజీవత్వమునకును అన్వయవ్యాప్తికలదు. అనగా నెచ్చటజీవముండునో అచ్చట మూలపదార్థముండును; ఎచ్చట మూలపదార్థముండునో అచ్చట జీవముండును. ఎక్కువ చుఱుకుదనముగల కణములో (Cell) నిదియెక్కుడుగను, తక్కువ చుఱుకుదనముగల కణములో దక్కువగను ఉండును. చేత నత్వముపోయి కణముకు జడత్వమురాగానే యీమూలపదార్థమును లేకుండబోవును. ఇట్లీమూలపదార్థమనునది సకలజీవులకును మూలాధారమైనది గనుకనే హక్సలే యను ఘనత వహించిన శాస్త్రజ్ఞుడు దీనికి చైతన్యముయొక్క భౌతిక ప్రాతిపదిక (Physical basis of life) మని పేరుపెట్టెను.