పుట:Jeevasastra Samgrahamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీసికొని వానిలోనుండి జీవమునకు ఆవశ్యకములయిన కణద్రవ్యము, రక్తము మొదలయిన ద్రవ్యముల నిర్మించుట. దీనిని ఈశాస్త్రమందు నిర్మాణ జీవనవ్యాపార (Constructive metabolism) మనియెదరు. రెండవది పైనవర్ణించినటుల నిర్మింపబడిన ద్రవ్యముల విఱుగ గొట్టి యందుండి చలనము మొదలయిన జీవనావశ్యకము లయిన శక్తులను వెలువరించుట. దీనిని వినాశ జీవనవ్యాపార మనవచ్చును. ఈ రెండు వ్యాపారములును జీవనమునకు ఆవశ్యకములు. ఇందు మొదటివ్యాపార మాగిపోయి, రెండవ వ్యాపారము మాత్రము నడచుచుండెనేని జీవి కొంతసేపు మాత్రము జీవించి మృతిచెందును. ఈ రెండు వ్యాపారములలో మొదటిది జీవస్థానాథీనము. రెండవది కణద్రవ్యాధీనము. ఏకకణ జీవులను జీవస్థానముగల భాగముగను, జీవస్థానము లేనిభాగముగను రెండు తునకలు చేసినయెడల, జీవస్థానములేని భాగము కొంతకాలము వఱకు చేతనత్వము యొక్క యన్నిలక్షణములును కలిగియుండి, పిదప వృద్ధిగాక మృతినొందును. ఇందుకు గారణ మేమన జీవస్థానములేక కేవలము కణపదార్థముగల భాగమునకు నిర్మాణజీవనవ్యాపారము చేతకాదు. అదివఱకు నిర్మాణవ్యాపారముచే సిద్ధము చేయబడియున్న ద్రవ్యములను దిని చైతన్యమును బుట్టించుకొనుచు కొంతసేపు బ్రతికియుండును. కాని యాద్రవ్యములు కాగానే క్రొత్తవి సంపాదించుకొను సామర్థ్యము లేనందున కరువులో అన్నములేని బీదవానివలె మడయును. జీవస్థానముగల భాగములలో కణద్రవ్యము బహుస్వల్పముగా నున్నను అవి పెఱిగి సంతానోత్పత్తి చేయుచుండును.

ఉత్క్రాంతివాదము.

(The Doctrine of Evolution)

సర్వ జీవములకును మూలపదార్థమే మూలాధార మని చదువరు లిదివఱకే గ్రహించియుందురు. ఈ మూలపదార్థమే యన్ని వృక్షములకును, అన్ని జంతువులకును, కూటస్థ పదార్థమని శాస్త్రజ్ఞుల యభిప్రాయమై యున్నది. అనగా మూలపదార్థముపై అనేక సంస్కారములు జరిగి యీ చతన పదార్థములన్నియు బుట్టినవి. మూలపదార్థ (Protoplasm) మయమైన కణము