Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ భాగమునకు ఫలకవచము (Pericarp) అని పేరు. ఉదా:- కందిగింజలను కాపాడుటకై వానిపై గప్పియుండు కాయగా నేర్పడుగుల్ల ఫలకవచమే.

ఫలకవచమునందలి భేదములు.

కొన్ని కాయలలో ఫలకవచము మొత్తనిదిగనుండును. వంకాయ, మామిడికాయ, పొన్నకాయ, ద్రాక్షకాయ, అరటికాయ మొదలగునవి. వీనికి గుంజుకాయలు (Sacculent Fruits) అని పేరు. వీనినే రసయుత ఫలము లనియు చెప్పుదురు.

ఫలకవచము కొన్ని కాయలలో నెండి గుల్ల యగును. ఇట్టి కాయలకు ఎండుకాయలు (Dry Fruits) అనిపేరు. వీనికి శుష్కఫలములనియు పేరు. ఉదా:- కందికాయ, చిక్కుడుకాయ, చింతకాయ మొదలగునవి.

గుంజుకాయలు.

గుంజుకాయలలో టెంకకాయలు కండకాయలు అని రెండు ముఖ్యభేదములు గలవు.

మామిడి, పొన్న మొదలగుకాయలలో ఫలకవచముయొక్క వెలుపలి భాగమున నుండు పదార్థము మెత్తగనే యుండి లోపలిభాగమున నుండు పదార్థము గట్టిపడి టెంక యగును. అట్టికాయలకు టెంక కాయలు (Drupes) అని పేరు. వీనికి శిలాఫలము లని నామాంతరము.