Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంకాయ, ద్రాక్షకాయ, పుచ్ఛకాయ మొదలగు కొన్నికాయలలో ఫలకవచము మిక్కిలి పలుచగ నుండి దానిలోపల గుంజు పెరుగును. వీని గింజ లీగుంజులో నిమిడియుండును. అట్టికాయలకు కండకాయలు (Berries) లేక మృదుఫలములు అని పేరు.

అరటికాయ కండకాయలలోనిదే. దానిగింజలు కాయయొక్క మధ్యభాగమున మూడు నాలుగు వరుసలుగానుండి నల్లనల్లగ కనబడుచుండును. కాని ఈగింజలయొక్క ఉపయోగము లేకయే దుంపలమూలమున సంతానవృద్ధి గలుగుచున్నందున, ఈగింజలకు మొలచునట్టి అలవాటు తప్పిపోయినది.

కొన్ని కండకాయలలో ఫలకవచముయొక్క వెలుపలిభాగము గట్టిపడి పెచ్చు అగును. ఉదా:- గుమ్మడి, బూడిదగుమ్మడి, పందిరి దోస, వెలక్కాయ మొదలగునవి. వీనిని శిలాఫలము లనగూడదు.