పుట:Jeevasastra Samgrahamu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాటితేగలలో మనము తినునట్టిభాగము ఈ బీజదళమే. ఇందు వరిపిండి, చక్కెర మొదలగు ఆహారపదార్థములు కొంత పీచువంటిపదార్థములో నిమిడియున్నవి. ఇది లేతమొక్కను మొట్టమొదట కొంతకాలమువరకు పోషించునిమిత్త మేర్పడినది. ఇట్టిబీజదళము తాడి, ఈత, కొబ్బరి, వరి, జొన్న మొదలగు కొన్ని మొక్కలలో ఒక్కటియే యుండును. కావుననే వాని కేకబీజదళవృక్షములను నామము పుట్టెను.

పిండోత్పత్తి అయినపిమ్మట సంయుక్తబీజము పైనజెప్పిన ప్రకారము ప్రథమమూలము ప్రథమశాఖాంకురము మొదలగు భాగములుగా పరిణమించుచుండగా స్థూల బీజాశయములోని గర్భము, పిండతిత్తి మొదలగు ఇతరభాగములుకూడ నొకానొక సమయమునందు మార్పులజెందును.

పైన వివరించినమార్పులను జూడ స్థూలబీజాశయమే సామాన్యముగా గింజగా నేర్పడు భాగ మని తెలియగలదు. ఇట్లు పరిపక్వమునొందిన స్థూలబీజాశయమునే అండమనియు వాడుదురు. ఈ అండములు గల అండాశయమే కాయ యగునది.

అండాశయమునుండి పరిణమించుభాగములు.

స్థూలబీజాశయమునుండి పరిణమించిన గింజ యొకటిగాని యనేకములుగాని పొట్టలో కలిగిన అండాశయమే కాయగా నేర్పడుచున్నది. ఎట్లన అండాశయముయొక్క పొట్టయే సామాన్యముగా కాయపై నుండెడు తొక్క, గుల్ల యనబడు పై భాగము.