సూర్యరశ్మి లేని కారణముచే క్రమముగా నశించిపోవును. సృష్టియందలి సమస్త జీవకోట్లయొక్కయు కడపటియుద్దేశము. తమ జాతిని సంతానవృద్ధిచే పెంపొందించుట యని యిదివరలో చెప్పియుంటిమి. ఇట్టి సృష్టివిధానము (Natural Law) నుబట్టి చెట్లు తమజాతిని వృద్ధి జేయుటకుగాను, తమ విత్తనములను తిరిగి వృక్షములగుటకు తగినస్థలములందు చేర్చవలసియున్నది గదా?
ఇట్టి వ్యాపకమును జేయునిమిత్తమై చెట్లు అనేక బంటుల నేర్పరచుకొనియున్నవని చెప్పవచ్చును.
1. జంతువులు:- వీనిచే తినబడిగాని వీని శరీరముల నంటిగాని యనేకగింజలు స్థలాంతరము జేరును. జంతువుల నాకర్షించునిమిత్తమై వృక్షములు తమ కాయలయం దేదో యొకభాగమున కొంత లంచమును జేర్చియుండును. ఉదా:- వెలువెల్లను చేదుగనుండు వేపచెట్టుసహితము తన గింజలకు అధిక వ్యాప్తి నిచ్చుటకై వానిచుట్టును తియ్యని గుంజును జేర్చియుంచును. ఈ గుంజున కాశపడి కాకులు మొదలగుజంతువులు వానిని మ్రింగి యందలి తియ్యనిలంచమును గ్రహించి దానికి ప్రత్యుపకారముగా నావృక్షముయొక్క గింజలను స్థాలాంతరమునకు జేర్చును. ఉత్తరేణి, అంట్రింత, చిగిరింత మొదలగు మొక్కలయొక్క కాయల యుపరితలమున నూగువంటి ముండ్లుండుటచే తమ్ము తాకుటకు తటస్థించిన పదార్థముల నవి యంటుకొని వానిమూలమున స్థలాంతరమునకు బోయి చేరును.