సనలును, వికారరూపములును గల పుష్పములు తమ్మెట్లు సంతోష పెట్టునని తలచెదరు? మరియు మానవున కగమ్యములైన కారడవులయందును, దుర్గమములగు పర్వతశిఖరములందును పుష్పించు పూవులు తమ కెట్లుపయోగపడును? కాన పుష్పములు తమ్ము గన్న వృక్షమునకు ఎట్లో యుపయోగకరముగా నుండునిమిత్తమర్ పుట్టినవని యూహింపనగును. అవి యా వృక్షములనిమిత్తమై యేయేపనుల నెట్లు నెరవేర్చుచున్నవో ముందు జూడగలము. మానవులకంటె తమ కెక్కుడుగ నుపయోగపరులగు నెవ్వరో మరి కొందరి మనముల రంజిల్ల జేసి వారివలన తాము పొందగల కొన్ని కార్యములను నెరవేర్చికొనుటకై యీ పూవు లిట్టి గంధ వేషాదులను ధరించునని మీరు ముందు గ్రహించగలరు.
సమస్తజీవకోట్ల జీవితమునకు కడపటి యుద్దేశము సంతానాభివృద్ధిచే స్వజాతిని పెంపొందించుటయే. అట్లయిన, వృక్షములు సంతానవృద్ధి నెట్లు జెందును? అందునకై పుష్పములు ఎట్లు సహకారు లగును?
వృక్షజాతులందు సంతానవృద్ధి రెండువిధములుగ నున్నది.
1. అంటులు.
తల్లి మొక్కయందలి కొన్ని నియతభాగములు భూమిలో పాతబడి తల్లివంటిమొక్కలుగా పెరుగును. మల్లె, చేమంతి మొదలగు పూవుల మొక్కల అంట్లును, కంద, పెండలము మొదలగు దుంపల ముక్కలును, చెరుకు మొదలగువాని శాఖాభాగములును, ఇట్టి సంతానవృద్ధి కుదాహరణములు. ఈ చెట్లకు సామాన్యముగా కాయలుండవు.