స్సును జెందినప్పటినుండి స్థూల (ఆడ) బీజమునకై వెదకులాడుచు బోవుచుండును. ఏక ఫలాపేక్షకములగు అనేక సూక్ష్మబీజములలో నొక్కదానికిమాత్రమే తనకోరిక సఫలమగును. తక్కినవన్నియు విఫల మనోరథములై కొంతకాలమునకు నాశముజెందును.
పుష్పముయొక్క ఉపయోగమేమి?
ఇంతవరకు అనుసరించిన మీకు హెచ్చుజాతివృక్షములందు వివాహసంబంధము లుండునని వ్రాసిన చిత్రముగ దోచదు. సృష్టియందలి వివిధవర్ణములును, రూపములును గల పుష్పములు మానవుని ఆనందింపజేయు నిమిత్తమై సృజింపబడినవని కొందరి యభిప్రాయము. మానవున కుపయోగము కాని పుష్పముయొక్క జన్మము నిష్ఫలమని వారు తలంచుదురు. ఒకానొక జంతువున కొక యవయవమున్న యెడల దాని యుపయోగము కూడ తోడనే యేర్పడియున్నది. ఎట్లన, మానవునకు గోళ్లు ఎందుకున్నవని అడిగిన తనకు జిల పుట్టినప్పుడు గోకుకొనుట కని చెప్పుదుము. పశువులకు కొమ్ము లెందు కుండునని యడిగిన ఆత్మ సంరక్షణార్థము అనగా శత్రువులనుండి తమ్ము రక్షించుకొనుటకు అనియు, తోక యెందు కేర్పడినదనగా జోరీగలబాధ తొలగించుటకు అనియు జెప్పుదుము. ఇట్లే చెట్టునందు పుష్ప మేల యేర్పడినది అనుప్రశ్నకు రసిక జనుల నానందింపజేయుటకనిచెప్పెడు ప్రత్యుత్తరము యుక్తముకాదని మా యభిప్రాయము. ఏలయన రమ్యమైనట్టియు, సువాసనగలవై నట్టియు పుష్పములు మానవుల యుపయోగము నిమిత్తమై మాత్రమె సృజింపబడె ననితలంచువారు, సహింపరానిదుర్వా