అయిదవ ప్రకరణము.
పూవు (The Flower)
సంతానవృద్ధి:- ఈవరకు జదివిన పుష్పములులేని వృక్షజాతిజీవులలో సంతానవృద్ధి ఎట్లు గలుగునో కొంచెము విమర్శించి దానికిని ప్రస్తుతము జదివెడు హెచ్చుజాతివృక్షములకుగల సంతానవృద్ధికిని తారతమ్యము లాలోచింతము. ఏకకణ ప్రాణులగు వృక్షజాతి సూక్ష్మజీవులలో స్త్రీపురుషవివక్షత బొత్తిగ గానరాదు. పసిరికపోగునం దాభేదము సూచనగా కన్పట్టినది. సంయోగమున కేర్పడిన రెండుపోగులలో నొకటి చురుకుగనుండి సంయోగవిధానమునకై ముందుగ పూనికొని యెక్కువ పరిశ్రమ జేయును. అది పురుషాంగములు గలది-అనగా మగది. రెండవది మందముగ నుండునది-ఆడుది. వారిపర్ణి, నాచుమొక్క వీనియందు స్త్రీపురుషావయవములు వేర్వేరుగా నున్నవి. కాని యవి రెండును ఏకవృక్షమునందే యుండును. వానియందలి స్త్రీపురుషబీజము లెట్లుండునో, వానికి సంయోగ మెట్లు కలుగునో, వానినుండి సంయుక్తబీజము ఎట్లు గలుగుచున్నదో జూచియుంటిమి. సూక్ష్మ (మగ) బీజ మెల్లయెడలను చిన్నదిగను చురుకుగలదిగను ఉన్నది. స్థూల (ఆడ) బీజము పెద్దదిగను స్థావరముగను ఉండును. సూక్ష్మ (మగ) బీజములు పెక్కుగ నుండి, యవి యుక్తవయ